–క్రమం తప్పకుండా పండించే పంటల వల్ల ఇబ్బందులు పడుతున్నారు
–వచ్చేవారం అవగాహన సదస్సులు నిర్వహించాలి
— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi: ప్రజాదీవెన నల్గొండ : ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం పట్ల జిల్లా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలే కాకుండా, కూరగాయలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటలు సాగు చేయడం, ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం ఉదయాదిత్య భవన్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, వ్యవసాయ అధికారులతో రానున్న వానకాలం వ్యవసాయ సాగు సంసిద్ధత పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు క్రమం తప్పకుండా పండించే వరి, పత్తి వంటి పంటల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రత్యేకించి వరిలో శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉండడం, పంట అమ్మకంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, అకాల వర్షాల వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని జిల్లా రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళించాలని, ముఖ్యంగా కంది, కూరగాయలు, పండ్ల తోటలు, అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటలవైపు వారిని మళ్లించాలని తెలిపారు. వీటితోపాటు, ప్రకృతి వ్యవసాయం పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించేలా రైతులకు అవగాహన కల్పించాలని, రైతు ఉత్పత్తి సంస్థల ఏర్పాటు, మరింతమంది అభ్యుదయ రైతుల ను తయారు చేయడం పై దృష్టి సాధించాలని కోరారు. ఉద్యాన పంటలు, నూతన వంగడాల సాగుకు సంబంధించి ప్రతి 2 మండలాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి మార్కెటింగ్ కు ప్రోత్సాహాం కల్పించేలా నెలలోపు ప్రతిపాదనలు సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఉద్యాన పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం తరఫున సబ్సిడీ, డ్రిప్ వంటి సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యాన పంటలు, కూరగాయల పంటల సాగు, అధిక దిగుబడులు సాధించే అంశాలపై వచ్చేవారం అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.
–నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడుతూ..
వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం సమగ్రమైన ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ శాసనసభ్యులు, కట్టంగూరు రైతు ఉత్పాదక సంస్థ వ్యవస్థాపకులు నంద్యాల నరసింహారెడ్డి అన్నారు. వివిధ రకాల పంటల సాగు, ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు సాధిస్తున్న అభ్యుదయ రైతులు మరి కొంతమంది అభ్యుదయ రైతులను తయారు చేయాలని, రైతులలో వ్యాపార దృక్పథం పెరగాల్సిన అవసరం ఉందని, రైతులు పండించిన పంటలకు పటిష్ట మార్కెట్ వ్యవస్థ ఉండాలని, మధ్యదళారీ వ్యవస్థ తగ్గాలని అన్నారు.
వ్యవసాయంలో ఉత్పాదకత పెరిగి పెట్టుబడి తగ్గేలా చూడాలన్నారు. ప్రతి పంటకు పట్టిష్టమైన మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేయటమే కాకుండా, సూక్ష్మ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల రైతులు పండించిన పంటలకు విలువ ఆధారిత సౌకర్యం కలుగుతుందన్నారు. జిల్లాలో గడచిన 10 సంవత్సరాలలో నీటిపారుదల సౌకర్యాలు పెరిగినందున రైతులు వరి వైపు కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు.
పలువురు రైతులు మాట్లాడుతూ..
చందంపేట అభ్యుదయ రైతు పద్మా రెడ్డి మాట్లాడుతూ సేంద్రియ ఎరువులతో పంటలు పండించడం, సంప్రదాయ పద్ధతిలో భూగర్భ జలాలు పెంచేందుకు కందకాల తవ్వకం, ఉధ్యాన, కూరగాయల పంటల వల్ల గడిచిన 10, 15 సంవత్సరాల నుండి వ్యవసాయంలో తాను అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నానని, గత 14 సంవత్సరాలుగా పంటలకు ఎలాంటి రసాయన ఎరువులు వినియోగించలేదని తెలిపారు.వరి ద్వారా రైతులకు ఎలాంటి లాభం లేదని, అందువలన ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు వెళ్ళవలసిన అవసరం ఉందని, ఇందుకు ప్రభుత్వం అవసరమైన వ్యవసాయ పనిముట్లు, సబ్సిడీ అందజేయాలని కోరారు.
ప్రకృతి వ్యవసాయ రైతు, ప్రకృతి వ్యవసాయ జిల్లా స్థాయి కమిటీ సభ్యులు అంజిరెడ్డి మాట్లాడుతూ తాను గడిచిన పది సంవత్సరాల నుండి ఏలాంటి పురుగుమందులు, ఎరువులు వాడకుండా సాధారణ పంటలతో పాటు, పనస, మామిడి, నిమ్మ వంటి పంటలను పండిస్తున్నానని, రైతు స్వయం సమృద్ధి సాధించడంతోపాటు, ఆరోగ్యం, స్వచ్ఛమైన, అత్యుత్తమ పోషక విలువలు కలిగిన పంటలను పండించేందుకు తాను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు.
సహజంగా పండిన పంటలలో సారం ఎక్కువగా ఉంటుందని అన్నారు. కరోనా కారణంగా చావుకు దగ్గరగా వెళ్ళిన తాను హైదరాబాదు నుండి తన సొంత గ్రామానికి వచ్చి ఆవులతో, దేశవాళి విత్తనాలను వినియోగించి ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత తన ఆరోగ్యం బాగు పడిందని, పత్తి, వరి పంటలను, ఇతర పంటలను సైతం ఎలాంటి రసాయన మందులు వాడకుండా పంటలను పండిస్తున్నానని, తన దగ్గర వినియోగదారులు వంద రూపాయల విలువచేసే వ్యవసాయ ఉత్పత్తులను కూడా 200 ఇచ్చి కొంటున్నారని, వ్యవసాయం ద్వారా జీవన విధానాన్ని మార్చుకునే విధంగా రైతులు,ప్రజలను తయారు చేయాల్సిన అవసరం ఉందని, గత ఐదు సంవత్సరాలలో తాను ఎరువులు పురుగు మందుల పై 10 రూపాయలు ఖర్చు చేయలేదని చండూరు మండలం, జక్కులవారి గూడెం కు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు జక్కుల వెంకటేష్ అన్నారు.
వ్యవసాయంపై ఉన్న మక్కువతో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకొని గ్రామానికి వచ్చి ముందుగా సెమి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ తర్వాత పూర్తిగా సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించానని, మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉన్న ప్రతి రైతు సేంద్రియ వ్యవసాయం చేయాలని నిడమనూరు మండలం, గుంటుపల్లి కి చెందిన రైతు నవీన్ రెడ్డి అన్నారు. తాను పండించిన పంటలను నల్గొండ తో పాటు, హైదరాబాదులో అమ్మేందుకు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నానని, నల్గొండలో ప్రస్తుతం రెండు స్టాల్స్ నిర్వహిస్తున్నానని, త్వరలోనే హైదరాబాద్లో మరో స్టాల్ ఏర్పాటు చేస్తున్నానని, సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలను డబుల్ రేట్ ఇచ్చి కొనేందుకు వినియోగదాలు సిద్ధంగా ఉన్నారని, అందువల్ల రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.
తానొక్కడినే సేంద్రీయ వ్యవసాయం చేయటమే కాకుండా, గ్రామాన్ని మొత్తాన్ని సేంద్రియ గ్రామంగా మార్చాలని కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. మందులు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లు అన్ని ఏర్పాటు చేసుకుని గోదాం కూడా కట్టించుకుని రైతుకు అన్ని సులభంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు నవీన్ రెడ్డి తెలిపారు.
కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ శ్రీనివాస్, అభ్యుదయ రైతులు కోట్టం సత్తిరెడ్డి, శ్రీనివాసరావు, మందడి గోపాల్ రెడ్డి, పల్లె జగన్, కనగల్ రాంరెడ్డి, బొడ్డుపల్లి ఈదయ్య, పెద్దఊర పాత ఎల్లయ్య, ఐలాపురం వెంకన్న తదితరులు నూతన పద్ధతిలో పండిస్తున్న ఉద్యాన, కూరగాయల సాగు, పామాయిల్ తోటల పెంపకం, ప్రకృతి వ్యవసాయం, లాభాలు, దిగుబడులు తదితర అంశాలపై వివరించారు.
జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి, తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూరగాయల సాగు, పామాయిల్ పై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కరపత్రాన్ని, బుక్ లెట్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.