Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi: చేయూత పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలి

— అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

–చనిపోయిన వారి పేర్లను పరిశీలించి ఆన్లైన్ జాబితా నుండి తొలగించాలి

–గ్రామాలలో తప్పనిసరిగా మరణ రిజిస్టర్ ను నిర్వహించాలి

–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

District Collector Ila Tripathi: ప్రజాదీవెన నల్గొండ: వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత పదం కింద పంపిణీ చేస్తున్న పెన్షన్లలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకూడదని, ఒకవేళ ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ కళాభారతిలో చేయూత పథకం పై నిర్వహించిన డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాల పెన్షన్లకు సంబంధించి ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీల లాగిన్లలో ఉన్న వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. అనారోగ్యం కారణంగా మంచానికి పరిమితమైన వారు, వివిధ కారణాలతో బయోమెట్రిక్ పడని వారికి మాత్రమే పంచాయతీ కార్యదర్శులు వారి బయోమెట్రిక్ ద్వారా పెన్షన్లు చెల్లించాలని, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఇతరుల పెన్షన్లను పి ఎస్ ల బయోమెట్రిక్ ద్వారా పెన్షన్లను డ్రా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మూడు నెలలకు మించి శాశ్వతంగా వలస వెళ్లినవారు, అలాగే చనిపోయిన వారు, ఇతర కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. ప్రత్యేకించి వృద్ధాప్య పెన్షన్లలో చనిపోయిన వారి పేర్లను ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఆన్లైన్ లో జాబితా నుండి తొలగించాలని, ఒకవేళ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు ఉంటే స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించారు. జిల్లాలో సుమారు 29 వేల పెన్షన్లు శాశ్వతంగా వలస వెళ్లిన వారి జాబితాలో ఉన్నాయని, వాటన్నింటిని గత నెల నుండి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చనిపోయిన, వలస వెళ్లిన పేర్లను తొలగించడం, చనిపోయిన వారి స్థానంలో వారి భార్య లేదా భర్తకు పెన్షన్ ఇవ్వడం వంటివి చేసిన తర్వాత ఈ సంఖ్య రెండువేలకు వచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఈ వివరాలన్నింటినీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు.

గ్రామాలలో తప్పనిసరిగా మరణ రిజిస్టర్ ను నిర్వహించాలని చెప్పారు.రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, రానున్న సీజన్లో వనమహోత్సవం కింద మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించడంతో పాటు, మొక్కలను పెంచాలని, ఇందుకు సంబంధించి 2025- 26 సంవత్సరానికి గాను కార్యచరణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు టాయిలెట్లను మంజూరు చేయడం జరుగుతుందని, అలాగే ప్రతి ఇంట్లో, ప్రతి ప్రభుత్వ సంస్థలో సోక్ పిట్ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అవగాహన సదస్సులో చేయూత పెన్షన్ల అర్హత , నియమ నిబంధనలు, పెన్షన్ల పంపిణీలో పంచాయతీ కార్యదర్శుల పాటించాల్సిన నియమాలు, ఆథెంటికేషన్, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.

ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, రాష్ట్ర సెర్ప్ కార్యాలయ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ల పంపిణీ సంచాలకులు గోపాలరావు, ఇన్చార్జి జెడ్పి సీఈఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.