Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi: నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ పెట్టండి

— ఇతర ప్రాంతాల నుండి జిల్లాకు నకిలీ విత్తనాలను రానీయోద్దు

–రైతులకు ముందస్తు అవగాహన కల్పించండి

–జిల్లాకు అదనంగా 97 మంది వ్యవసాయ శాఖ అధికారులు

–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

District Collector Ila Tripathi: ప్రజాదీవెన నల్గొండ: నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుండి నల్గొండ జిల్లాలోకి నకిలీ విత్తనాలు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేయాలని, నకిలీ విత్తనాలు అమ్మేవారి పై దాడులు నిర్వహించి కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బయటి ప్రాంతం నుండి ఎట్టి పరిస్థితులలో జిల్లాకు నకిలీ విత్తనాలను రానీయవద్దని ఆమె అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వరి, పత్తి తో పాటు, ఇతర ఉద్యాన పంటలు, వాణిజ్య పంటలు పండించేందుకు ఎక్కువగా అవకాశం ఉందని, ఈ సంవత్సరం ముందుగానే వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున రైతులు పంటలు వేసుకునేందుకు ముందే చర్యలు తీసుకుంటారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని విత్తనాలు అమ్మే వారు రైతులకు కల్తీ విత్తనాలు అమ్మి మోసం చేసే అవకాశం ఉందని, అందువల్ల నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సహాయ సంచాలకులు, సబ్ ఇన్స్పెక్టర్లు వారివారి పరిధిలో నకిలీ విత్తనాల సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ముందుగానే అవసరమైన అవగాహన కల్పించాలని ఆమె ఆదేశించారు. అనుమతి ఉన్న డీలర్ల వద్దనే రైతులు విత్తనాలు కొనాలని, లూజ్ విత్తనాలను ఎట్టి పరిస్థితులలో కొనవద్దని చెప్పారు.

జిల్లాలో 140 మంది గజిటెడ్ అధికారులు వ్యవసాయ శాఖలో పని చేస్తుండగా, జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి 97 మందిని అదనంగా జిల్లాకు నియమించేందుకు అంగీకరించడం పట్ల ఆమె కృతజ్ఞత తెలిపారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా వీరు తోడవుతారని, అందువల్ల నకిలీ విత్తనాల పై గట్టి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రత్యేకించి ఖమ్మం ఇతర ఆంధ్ర ప్రాంతం నుండి నకిలీ విత్తనాలు రావడానికి అవకాశం ఉందని, వీటిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, అంతేకాక పత్తి, ఉద్యాన విత్తనాలపై దృష్టి పెట్టాలని కోరారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు వ్యవసాయాధికారుల దృష్టికి వచ్చినట్లయితే పోలీస్ సహకారం తీసుకుని వారిని కట్టడి చేయాలని చెప్పారు.

రాత్రి సమయాలలో కల్తీ విత్తనాలు అమ్మే వారు బృందాలుగా ఏర్పడి తిరుగుతారని, దీనిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, సరైన సమాచారం పోలీస్ కు అందజేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నకిలీ విత్తనాల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు. నకిలీ విత్తనాలమ్మే వారిపై పి డి యాక్ట్ నమోదు చేస్తామన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ ఈ వ్యవసాయ సీజన్ లో అందుబాటులో ఉన్న విత్తనాలు, తదితర వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో వ్యవసాయ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, తదితరులు, హాజరయ్యారు.