Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi: బాలింత మృతి పై మెజిస్టేరియల్, శాఖపరమైన విచారణకు ఆదేశం

–ప్రభుత్వ వైద్యులు రోగులను ప్రైవేటుకు రెఫర్ చేస్తే చర్యలు

— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

–మాతృ మరణాలపై సమీక్ష

–వైద్యాధికారులపై ఆగ్రహం

–సంఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

District Collector Ila Tripathi: ప్రజాదీవెన నల్గొండ: గత డిసెంబర్ లో కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చిన దామరచర్ల మండలం, జైత్రం తండాకు చెందిన అడావత్ రాజేశ్వరికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం సరిగా లేనప్పటికీ సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం లో నిర్లక్ష్యం వహించి రాజేశ్వరి మృతికి కారణమైన మిర్యాలగూడ శిరీష ఆస్పత్రి పై మెజిస్టీరియల్ విచారణతో పాటు, శాఖా పరమైన విచారణకు ఆదేశిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

గత సంవత్సరం డిసెంబర్ లో మృతురాలు రాజేశ్వరి కాన్పు కోసం మిర్యాలగూడలోని శిరీష ఆస్పత్రికి వెళ్లగా, అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ శిరీష చివరి క్షణం వరకు ఆసుపత్రిలో ఉంచుకొని అనంతరం నల్గొండ లోని ప్రభుత్వ ప్రధానాస్పత్రికి పంపించగా, డిసెంబర్ 28 న నల్గొండ ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో ప్రసవానంతరం రాజేశ్వరి మృతి చెందిన విషయం తెలిసిందే. రాజేశ్వరి మృతి చెందిన సంఘటనలో నిర్లక్ష్యం వహించిన మిర్యాలగూడ శిరీష ఆస్పత్రి పై మెజిస్టేబుల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాతృ మరణాలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ కేసు విచారణకు రాగా వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు జిల్లాలో పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేషెంట్ల అవగాహన లోపం, నిర్లక్ష్యం, తదితర కారణాలవల్ల మాతృ మరణాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడి కార్యకర్తలు మొదలుకొని, ఆశ, ఏఎన్ఎం, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది గ్రామాలలోని గర్భిణీ స్త్రీలు, గర్భిణీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రసవం సమయంలో చేయించుకునే పరీక్షలు, తదితర అన్ని అంశాల పట్ల వారికి అవగాహన కల్పించాలని అన్నారు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవమయ్యే వరకు నిరంతరం
ఏఎన్సి చెకప్ తో పాటు, ఈడిడీ ప్రకారం సుఖప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఈ మధ్యలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తిన్నట్లయితే తక్షణమే చికిత్స అందించాలని, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం స్థాయిలో సాధ్యం కానట్లయితే ఏరియా ఆసుపత్రులకు రిఫర్ చేయాలని అన్నారు.

ప్రభుత్వ వైద్యులు రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, తదితర కారణాలవల్ల ప్రసవమైన తర్వాత మహిళలు మరణిస్తున్నారని, మరికొన్ని కేసుల్లో సరైన చికిత్సలు తీసుకోకపోవడం, పౌష్టికాహార లోపం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, ఈ అంశాల పట్ల ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాలలోని ప్రజలు, గర్భిణీ స్త్రీలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, ఇందుకుగాను ఆశ, అంగన్వాడి, ఏఎన్ఎంలు ఇళ్లిళ్ళు తిరిగి వారికి అవగాహన కల్పించాలన్నారు. మాతృ మరణాలను నివారించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఐసిడిఎస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర అన్ని శాఖలు తోడుగా నిలవడంతో పాటు, అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తామని తెలిపారు. గ్రామాలలో ఎవరైనా ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వస్తే అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాతృనాయక్, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణ కుమారి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, డిప్యూటీ డిఎంహెచ్వోలు, వైద్యాధికారులు, ఎం సి హెచ్ సూపర్వైజర్లు, సిడిపివోలు, ఆశ కార్యకర్తలు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.