— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi :ప్రజాదీవెన నల్గొండ : శివన్న గూడెం రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే గ్రామాల స్థానంలో ఏర్పాటు చేయనున్న పునరావాస కేంద్రాలకు 2 రోజుల్లో స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె చండూరు ఆర్డీవో కార్యాలయంలో చండూరు ఆర్డీవో శ్రీదేవి, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, ఇతర అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా శివన్న గూడెం రిజర్వాయర్ కింద భూసేకరణ, తదితర అంశాలను జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా శివన్నగూడెం రిజర్వాయర్ లో ముంపునకు గురవుతున్న చర్లగూడెం, వెంకేపల్లి తండాలు ముంపునకు గురవుతుండగా, వీటి స్థానంలో పునరావస కేంద్రాల నిర్మాణానికి సుమారు 80 ఎకరాల స్థలం అవసరం ఉన్నట్లుగా గుర్తించినట్లు రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ 2 రోజుల్లో స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. తాగునీరు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చండూర్ ఆర్డీవో కార్యాలయానికి ఇన్వర్టర్ ను మంజూరు చేశారు.