–అన్ని వర్గాల వారు సహకారం అందించాలి
–విద్యుత్ సమస్య నివారణకు క్విక్ రెస్పాన్స్ టీమ్ వాహనం ఏర్పాటు
–బెల్ట్ షాపులు లేకుండా చర్యలు
— సమస్యలు ఉంటే 18004251442 నంబర్ కు కాల్ చేయండి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi :ప్రజాదీవెన నల్లగొండ : శాంతియుత వాతావరణం లో, ప్రశాంతంగా, సోదర భావంతో ఈ సంవత్సరం రంజాన్ పండుగను జరుపుకుందామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు అన్ని వర్గాల వారు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా రంజాన్ సందర్భంగా పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనుకోకుండా విద్యుత్తు సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కరించేందుకుగాను ఒక క్విక్ రెస్పాన్స్ టీమ్ వాహనం ఏర్పాటు చేయాలని విద్యుత్తు శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లును ఆదేశించారు. నల్గొండ పట్టణంతో పాటు, ముఖ్యమైన పట్టణాలలో మసీదులు, ప్రార్థన స్థలాలు, రహదారులపై పరిశుభ్రత లోపించకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. విలీన గ్రామాలలో పారిశుధ్యాన్ని జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షించాలని చెప్పారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించగా, రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రత్యేకంగా తెల్ల కార్డుదారులకు ఇచ్చే రేషన్ విషయంలో గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అలాగే శాంతి భద్రతాలను జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తారని చెప్పారు. రంజాన్ రోజున పాల వినియోగం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల పాలు ఎక్కువగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరగా, డైరీ డెవలప్మెంట్ కు లేఖ రాయడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసే తిను బండారాల షాపులు, షాపుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18004251442 నంబర్ కు కాల్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసాన్ని దృష్టిలో ఉంచుకొని సున్నిత ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పెంచడం జరుగుతుందని, గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాత్రి సమయంలో షాపుల నిర్వహణ సమయంలో ఎలాంటి మార్పు ఉండదని, పోలిస్ తరఫున ఇందుకు సహకారం ఇస్తామని, ప్రకాశం బజార్ లో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఫుట్ పాత్ వ్యాపారాలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా రాత్రిపూట పోలీస్ ద్వారా నాకబంది నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఎవరైనా కావాలని అపోహలు, అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తే అటువంటి వారిని ముందే గుర్తించి బైండోవర్ చేస్తామని తెలిపారు. మత సామరస్యానికి సంబంధించి వచ్చే పుకార్లను ఎట్టి పరిస్థితులలో నమ్మొద్దని, ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, బందోబస్తు విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్ఛార్జి డిఆర్ అశోక్ రెడ్డి, తదితరులు మాట్లాడారు.
ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి…
కాగా శాంతి కమిటీ సభ్యులు గోలిమదుసూధన్ రెడ్డి, కాజా గౌస్ మొహిద్దిన్, సలీం, రఫీక్, షౌరయ్య తదితరులు మాట్లాడుతూ తాగునీరు, విద్యుత్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, శాంతిభద్రతల విషయంలో జిల్లా అంతా పెట్రోలింగ్ నిర్వహించాలని,రంజాన్ పండుగ జరిగే మార్చి 31 న ఎక్కువ మొత్తంలో సమూహాలు వెళ్లే అవకాశం ఉన్నందున పెట్రోలింగ్ పెంచాలని కోరారు. ఏవైనా సమస్యలను తెలియజేసేందుకు ఒక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేయాలని, ఎల్పిజి గ్యాస్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, ఫుట్ పాత్ పై వ్యాపారం చేసుకునే వారికి సమయాన్ని పెంచాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకుండా చర్యలు తీసుకోవాలని, మసీదుల వద్ద నమాజు సమయంలో ప్రశాంతంగా ఉండేలా చూడాలని, సీసీ కెమెరాల నిఘా ఉంచాలని, రేషన్ కార్డు పై ప్రత్యేకంగా గోధుమలు, చక్కర ఇవ్వాలని, ఆయా మసీదుల వద్ద హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని, ఇమామ్ లు, మొజంల బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పారసరఫరాల అధికారి తదితరులు మాట్లాడుతూ శానిటేషన్, తాగునీరు, విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, రంజాన్ సందర్భంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు, శాంతి కమిటీ సభ్యులు హాజరయ్యారు.