–సిపిఎం ప్రజా సమస్యల అధ్యయనంలో బయటపడిన మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల
CPM MD Saleem : ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ పట్టణంలో మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి 2007 ఆగస్టులో శిలాఫలకం వేసి నిర్మాణం మరిచిన విధానం మైనారిటీల పట్ల ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుందని సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అన్నారు. శనివారం సిపిఎం స్థానిక సమస్యల సర్వే లో భాగంగా కలెక్టరేట్ వెనుక భాగంలో 6 ఎకరాల స్థలంలో మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి వేసిన శిలాఫలకాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2007లో ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్న కాలంలో నలగొండ పట్టణంలో అద్దె భవనంలో కొనసాగుతున్న మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలకు సొంత భవనం నిర్మించడం కోసం 6 ఎకరాల స్థలం కేటాయించి 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు.
18 సంవత్సరాలు గడిచిన శిలాఫలకం శిథిలావస్థకు చేరిందే తప్ప పాఠశాలకు పునాది రాయి కూడా పడలేదని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి అంటూ వేసిన శిలాఫలకాలలో నిర్మాణం జరిగినవి ఎన్ని శిథిలావస్థకు చేరినవి ఎన్ని ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోవాలని కోరారు. నల్గొండ పట్టణంలో మైనారిటీ గురుకుల పాఠశాల అద్దే భవనంలో కొనసాగుతూ మౌలిక సదుపాయాలు మరుగుదొడ్లు, ఆటో స్థలం, మంచినీటి సదుపాయం లేకుండా బాలికలు విద్యను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. మైనారిటీల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణం చేసి బాలికల విద్య కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, అవుట రవీందర్, గాదె నరసింహ, సలివోజు సైదాచారి, గంజి రాజేష్, లాజర్ తదితరులు పాల్గొన్నారు.