–పండ్ల తోటలు, కూరగాయల సాగు, యంత్ర పరికరాలకు రాయితీలు
— 2025-26 వార్షిక ప్రణాళిక ఖరారు
–నల్లగొండ జిల్లాకు 58.33 కోట్ల కేటాయింపు
— జిల్లా రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలి
— ఉద్యానవన శాఖా అధికారులు
Horticulture Officer Ananth Reddy: ప్రజాదీవెన నల్గొండ బ్యూరో : ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2025-26వ సంవత్సరానికి వార్షిక ప్రణాళిక ఖరారు చేసింది. నల్గొండ జిల్లాకు రూ.58.33 కోట్లు కేటాయించింది. ఉద్యాన పంటలతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు ఆర్జించవచ్చనే ఉద్దేశంతో విరివిగా రాయితీలు అందిస్తోంది. అకాల వర్షాల కారణంగా నష్టాలు చవిచూసిన, తక్కువ ఆదాయం గల పంటలు సాగు చేస్తున్నవారు, పంట మార్పిడి చేసి అధికాదాయం ఇచ్చే, ప్రత్యామ్నాయ పంటల కోసం ఈ రాయితీలు కల్పిస్తోంది. ఈ సంవత్సరం వార్షిక ప్రణాళిక అమలు ప్రక్రియను జిల్లా అధికారులు ప్రారంభించారు. ఆసక్తి గల రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి అనంతరెడ్డి తెలిపారు.
— బిందు సేద్యం పథకం…
బిందు సేద్య(డ్రిప్) పరికరాల కోసం జిల్లాకు మొదటి విడతగా రూ.3 కోట్ల అంచనాతో 330 ఎకరాల భౌతిక లక్ష్యాలు కేటాయించారు. షెడ్యూలు కులాలు, తెగల రైతులకు 100 శాతం, వెనుకబడిన, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాత రాయితీ కల్పించారు. డ్రిప్ కోసం రైతులు సమీపంలోని
మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
— ఆయిల్ పాం సాగు…
కోతులు, దొంగల బెడద లేని ఏకైక పంట ఇది. నల్గొండ జిల్లాలో ఈ ఏడాది 6500 ఎకరాల్లో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా పతంజలి కంపెనీ మొక్కలను అందిస్తుంది. వీటికి రూ.2100 రాయితీతో పాటు నిర్వహణ రాయితీ, అంతర పంటలకు ఎకరానికి రూ.2100 చొప్పున సబ్సిడీ ఇస్తారు.
–సమీకృత ఉద్యాన మిషన్…
డ్రాగన్ ఫ్రూట్, అరటి, అంజీర, అవకాడో, బొప్పాయి, ఉసిరి, మామిడి, నిమ్మ, జామ, అల్ల నేరేడు, పనస, చింత, సీతాఫలం, జామ, దానిమ్మ, కుకావో హైబ్రిడ్ కూరగాయలు, పూల తోటల పెంపకానికి 540 హెక్టార్లలో రాయితీ కల్పిస్తున్నారు. ముదురు మామిడి తోటల పునరుద్ధరణకు 275 హెక్టార్లు, మల్చింగ్ షీట్ వేసుకునేందుకు 342 హెక్టార్లు, ప్యాక్ హౌస్ కు 16 యూనిట్లు, ఉద్యాన యాంత్రీకరణకు ట్రాక్టర్ స్పేర్లు, పవర్ టిల్లర్, పవర్ లీడర్లు, క్రష్ కట్టర్, దైవాన్ స్పెయర్లు మొత్తం 700 యూనిట్లను కేటాయించారు. అదేవిధంగా కూరగాయల సాగు కోసం టమాట, వంగ, మిర్చి పంటకు నారు ఇస్తారు. 12 లక్షలతో 50 హెక్టార్ల లక్ష్యం గా నిర్ణయించారు. కూరగాయల సాగు పెంచేందుకు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా శాశ్వత పందిళ్ళ నిర్మాణం కోసం మూడు కోట్లు కేటాయించారు. 600 యూనిట్లను లక్ష్యంగా ఖరారు చేశారు.
–జాతీయ వెదురు మిషన్..
వెదురు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వెదురు మొక్కలు నాటిన రైతులకు రాయితీ కల్పిస్తోంది. జిల్లాకు 50 ఎకరాల్లో రూ.7.20 లక్షల ఆర్థిక లక్ష్యం నిర్ణయించారు.
ఉద్యాన పంటలతో రైతులకు ప్రోత్సాహకం…
పి. అనంత రెడ్డి (ఉద్యాన పట్టు పరిశ్రమల జిల్లా అధికారి నల్గొండ )
ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యాన పంటలతో పాటు కూరగాయల సాగుకు, ఇతర పంటల సాగుకు ప్రోత్సాహకం అందుతుంది. ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. డ్రిప్పును కూడా సబ్సిడీపై అందజేస్తాం. ఆయిల్ ఫామ్ సాగును విస్తరించేందుకు ప్రాణాలికలు రూపొందించాం.