–అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి
–ప్రగతికి సంబంధించిన నివేదికలను తక్షణమే సిపిఓ కు అందజేయాలి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda Collector Tripathi : ప్రజా దీవన నల్గొండ : ఈ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథి సందేశానికి ఆయా శాఖలు వారి ప్రగతికి సంబంధించిన నివేదికలను తక్షణమే ముఖ్య ప్రణాళిక అధికారికి అందజేయాలన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్షించారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం వేడుకలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని చెప్పారు.
ఆగస్టు 15న ఉదయం 9 గంటలకు పోలీస్ పరేడ్ మైదానంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు మొదలవుతాయని, ఎప్పటిలాగే ముఖ్య అతిథి జాతీయ పతాకావిష్కరణ, వందన స్వీకరణ, సందేశం, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, స్టాల్స్ తదితరాలు ఉంటాయని తెలిపారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయా శాఖలు వారి అభివృద్ధిని తెలిపే విధంగా శకటాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే విధంగా పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వివిధ శాఖల ద్వారా లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీకై ఏర్పాటు చేయాలని చెప్పారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే అతిథులు, ప్రజలకు, విద్యార్థులకు అవసరమైన తాగునీరు ,టెంట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తదితర ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు నిర్వహించాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.