Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Indira Solar Hill Hydropower Project: పోడు భూముల్లో.. “సౌర జలసిరులు”!

–సాగుకు సర్కారు తోడ్పాటు

–ఇందిర సౌర జల వికాసంతో ముందడుగు

— నల్లగొండ జిల్లాలో రెండు విడతలుగా పోడు పట్టాల జారి

— పోడు రైతులకు చేకూరానున్న లబ్ది

— మొదటి ఏడాదిలో లబ్ధి పొందనున్న 275 మంది రైతులు

–ఏర్పాట్లపై గిరిజన సంక్షేమ శాఖ అధికారులు

ప్రజాదీవెన నల్గొండ బ్యూరో : అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పాలకులు పోడు పట్టాలు జారీ చేశారు. వీటిలో నీటి వసతి లేక వానాకాలంలో మాత్రమే సాగు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో బోరు వేసి సౌర విద్యుత్తు పంపుసెట్లతో నీరందించే ఉద్దేశంతో.. రాష్ట్రప్రభుత్వం ఇందిర సౌర గిరి జలవికాస పథకానికి శ్రీకారం చుట్టింది. గత సోమవారమే నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించారు. 2025-26 నుండి 2029-30 వరకు అయిదేళ్ల పాటు ఏటా జిల్లాల వారీగా రైతులు, ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశిస్తూ.. జిల్లా, మండల స్థాయి కమిటీల ఆధ్వర్యంలో సర్వేలు చేసి అంచనాలు తయారు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నల్గొండ జిల్లాలో 2007-8లో 3888 మంది రైతులకు 8047 ఎకరాలకు, 2022-23 లో 2928 మంది రైతులకు 5578 ఎకరాలకు రెండు విడతలుగా పోడు పట్టాలు జారీ చేశారు. ఇంకా పత్రాలు రాని వారూ ఉన్నారు. తాజాగా ప్రభుత్వం ఆ భూముల్లో సౌర విద్యుత్తు, మోటార్ల ఏర్పాటుతో నీటి వసతి కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. నల్లగొండ జిల్లాలో ఐదేళ్ల కాలంలో 6083 మంది పోడు రైతులకు సంబంధించిన పోడు భూములలో నీటి వసతి కల్పించే లక్ష్యాన్ని నిర్దేశించారు. నల్లగొండ జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

–యూనిట్ కు 6 లక్షలు…

పోడు పట్టాలు కలిగిన రైతుకు కనీసం 2.5 ఎకరాలకు ఒక యూనిట్ మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతకు తక్కువ ఉంటే చుట్టు పక్కల వారిని కలిపి గ్రూపుగా ఏర్పాటు చేసి యూనిట్ మంజూరు చేయొచ్చు. ఒక్కో యూనిట్ విలువ రూ.6 లక్షలు కేటాయించారు. బోర్లు వేసేందుకు యంత్రం వెళ్లలేని ప్రాంతాల్లో బావుల్లో బోర్లు (ఓపెన్ వెల్స్) తవ్వొచ్చని పేర్కొంది. కానీ యూనిట్ విలువకు మించొద్దు. ఈ పథకం కింద రైతు చేలలో బోర్లు, బావులు, సౌర విద్యుత్తు పలకలు, మోటార్ వంటివి ఏర్పాటు చేసి నీటివసతి కల్పించాలి.

–కమిటీల పర్యవేక్షణలో…

జిల్లా స్థాయి కమిటీలో చైర్మన్ కలెక్టర్, డిటి డబ్ల్యూఓ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మెంబర్ కన్వీనర్లుగా, సాంఘిక సంక్షేమ శాఖ, రెవెన్యూ, డీఆర్డీవో, డీఎఫ్ఓ, గ్రౌండ్ వాటర్, విద్యుత్తు, ఆర్అండ్ బి, పీఆర్, నీటిపారుదల, డీపీవో, డీటీవో, ఉద్యాన, వ్యవసాయ అధికారులు సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీ చైర్మన్ గా ఎంపీడీవో, ఆయా శాఖల నుంచి సభ్యులుగా ఉంటారు. మే 25 వరకు మండలాల వారీగా పోడు పట్టాలు కలిగిన ఎస్టీ రైతుల గుర్తింపు, 26 నుంచి జూన్ 10వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో ఆ భూముల్లో భూగర్భ జలశాఖ అధికారులు పరిశీలించి పరిస్థితి, నీటి వసతికి అంచనాలు సిద్ధం చేయాలి. వాటిని మండల కమిటీ ద్వారా జిల్లా కమిటీకి పంపాలి. కలెక్టర్ పరిశీలించి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదం కోసం
పంపించాలి.

కలెక్టర్ ఆధ్వర్యంలో అమలు..

రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక మంది గిరిజన రైతులు అటవీ హక్కుల చట్టం కింద పోడు వ్యవ సాయం చేసుకునేందుకు భూ యాజమాన్య హక్కును కల్పించింది. ఆ భూముల్లో రాబోయే ఐదేళ్లల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రస్తుతం సర్కారు నిర్ణయించింది. గిరిజనుల సంక్షేమం కోసం పలు అంశాలను ఇందులో పరిచారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టం ప్రకారం సంక్రమించిన పోడు భూములకు ఈ పథకంతో లబ్ది చేకూర్చాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పదకాన్ని అమలు చేయనున్నారు. పోడు భూముల్లో వంద శాతం సబ్సిడీతో సమగ్ర భూమి అభివృద్ది పనులతో పాటు సౌర విద్యుత్తో కూడిన సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. తద్వారా ఆ భూములను సాగుకు యోగ్యంగా మార్చి గిరిజన రైతు కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.

–అభివృద్ధి పనులు ఇలా..

–ఈ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు పోడు భూముల్లో చేపట్టనున్నారు.

–మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపా దిహామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

–ఈ భూముల్లో భూగర్భ, నీటి సర్వే చేపట్టి రైతుకు లబ్ధి చేకూరేలా చేతిబావులు తవ్వకం చేపట్టనున్నారు.

–5 హెచ్ఎ, 7.5 హెచ్పీ సోలార్ పంపు సెట్లు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ అందించి సాగునీటి సౌకర్యం కల్పిస్తారు.

–వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు, యాంత్రీకరణకు సహకారం అందించనున్నారు.

–ఉద్యానవన శాఖ ద్వారా మెరుగైన నీటి యాజమాన్యం కోసం డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయనున్నారు.