–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
–నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె నల్గొండ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నల్గొండ నియోజకవర్గ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై గృహనిర్మాణ శాఖ అధికారులు, తహసిల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఆయా మండలాల వారిగా సమీక్ష సందర్భంగా నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 గృహాలు కేటాయించగా, మొదటి ,రెండో విడతలో 3337 గృహాలు మంజూరు చేయడం జరిగిందని ,అందులో 1129 గ్రౌండ్ కాగా, బేస్మెంట్ స్థాయిలో 1037 రూఫ్ లెవెల్ స్థాయిలో 67, పూర్తి దశలో 25 ఉన్నాయని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలోని మండలాల ప్రత్యేక అధికారులు, గృహ నిర్మాణ ఇంజనీర్లు, ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రౌండింగ్ ను పెంచాలని చెప్పారు. గృహాలు నిర్మించుకోనెందుకు సుముఖత లేని లబ్ధిదారుల నుండి సమ్మతి తీసుకోవాలని చెప్పారు.
పూర్తయిన గృహాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ప్రారంభోత్సవం చేసేందుకు చర్యలు తీసుకోవాలని, నల్గొండ మున్సిపాలిటీ తో పాటు, కనగల్, తిప్పర్తి మండలాలలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఇందిరమ్మ గృహాలకు సంబంధించి ఇసుక, మేషన్ల సమస్యలను తహసిల్దార్లు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మంజూరైన మొత్తం గృహాలు గ్రౌండ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఎంపీడీవోలపై ఉందని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, గృహ నిర్మాణ శాఖ పీడి రాజకుమార్, ఆర్డిఓ వై. .అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఈ సమావేశానికి హాజరయ్యారు.