–మాజీ సీఎం జగన్ మనోగతంలో ని మర్మం పై ఊహగానాలు
–ఎంపీగా పోటీ చేస్తారంటూ విస్తృతస్థాయిలో ప్రచారాలు
–సాధ్యాసాధ్యాలపై అంతర్మదనం లో జగన్ కోటరీలు
–ఆసక్తికరంగా తారాస్థాయికి చేరు కున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
Jagan: ప్రజాదీవెన, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) ఆసక్తికరంగా మారుతున్నాయి. వై నాట్ 175 అంటూ కొండంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఫలితాలు మాత్రం ఊహించని విధంగా వచ్చాయి. 151 అసెంబ్లీ స్థానాల నుంచి 11 స్థానాలకు వైసీపీ (ycp) పడిపోయింది. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా రాలేదు. మరో విపక్ష పార్టీ ఏపీ అసెంబ్లీలో లేనందున.. 39 శాతానికిపైగా ఓట్లు వచ్చినందున తమకే ప్రతిపక్ష హోదా (Opposition status) ఇస్తారని జగన్ ఆశించారు. కానీ గత అసెంబ్లీలో తమను ఘోరంగా అవమానించిన జగన్మోహన్ రెడ్డికి తాము గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ (tdp)అనుకుంటోంది. జగన్ పై కనీసం కనికరం చూపే అవకాశం లేదని ఆయన లేఖ రాసినప్పుడే కటువైన విమర్శల ద్వారా సందేశం ఇచ్చారు. దాంతో జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాలా లేదా అన్న డైలమాలో ఉన్నారు. ఇంకా వైసీపీఎల్పీ నేతగా కూడా ఆయన అధికారికంగా ఎన్నిక కాలేదు.ఇప్పుడు ప్లాన్ మార్చి తాను ఢిల్లీ కి వెళ్లి రాజకీయం చేయాలనుకుంటున్నారని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఎంపీగా ఉండటమే సేఫ్ అనుకుంటున్న వైసీపీ అధినేత ?
ఏపీలో (ap) రాజకీయం గత ఐదేళ్ల కాలంలో చాలా ఉద్రిక్తంగా మారింది. వైసీపీ రాజకీయాలు రాజకీయం, వ్యక్తిగతం అనే తేడా లేకుండా చేశాయి. ఫలితంగా రాజకీయ ప్రత్యర్థి అంటే.. వ్యక్తిగత శత్రువే అన్నట్లుగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య వైరం పెరిగింది. పార్టీల మధ్య కూడా అలాంటి పరిస్థితే ఉంది. నిండుకుండలా తొణకకుండా ఉండే చంద్రబాబునాయుడు కూడా ఓ సారి కన్నీరు పెట్టుకుని సవాల్ చేసి అసెంబ్లీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. టీడీపీ నేతలు (tdp leaders) ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టారని అంటున్నారు. తము వదిలే ప్రశ్నే లేదని గతంలో చాలా సవాళ్లు చేశారు.ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఏపీలో రాజకీయాలు చేయడం అంత సేఫ్ కాదని .. ఢిల్లీ (delhi)నుంచి రాజకీయం చేయడమే మంచిదని జగన్ ఫీలవుతున్నట్లుగా చెబుతున్నారు. అందుకే పులివెందుల ఎమ్మెల్యే కడప ఎంపీ స్థానాలకు రాజీనామాలు చేసి.. స్థానాలు మార్చుకుని పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో విజయాలు
2011 లో పులివెందుల అసెంబ్లీకి, కడప పార్లమెంట్‌కు గతంలో ఓ సారి ఉపఎన్నికలు వచ్చాయి. వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ కు (congress) గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత తమ పదవులకు రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్లారు వైఎస్ విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో వైఎస్ విజయమ్మ పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా , జగన్ మోహన్ రెడ్డి కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) నుంచి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) పోటీ చేసినప్పటికీ విజయమ్మ 90 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎంపీ స్థానంలో జగన్మోహన్ రెడ్డికి ఐదున్నర లక్షలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. వైసీపీ పునాదులు అప్పుడే బలంగా పడ్డాయి.
అప్పటితో పోలిస్తే ఇప్పుడు పూర్తిగా పరిస్థితులు వేరు
2011లో జరిగిన ఉపఎన్నికలతో పోలిస్తే (Compared to by-elections)ఇప్పుడు ఉపఎన్నికలకు వెళ్లడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమేనని రాజకీయవర్గాల అంచనా. ఎందుకంటే అప్పట్లో వైఎస్ (ys)చనిపోయిన సానుభూతి, కాంగ్రెస్ హైకమాండ్ అన్యాయం చేసిందన్న ప్రచారం భారీ స్థాయిలో జరిగాయి. ప్రజల్లో సానుభూతి పవనాలు బాగీ వీయడంతో ఉపఎన్నికల్లో భారీ విజయం సాధించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నం. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. సాధారణ ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి అరవై వేల ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. 2019తో పోలిస్తే ఆయన మెజార్టీ తగ్గింది. ఎంపీ స్థానంలో కూడా అరవై వేల ఓట్లకు కాస్త ఎక్కువ తేడాతో అవినాష్ రెడ్డి గెలిచారు. ఇంత తక్కువ మెజార్టీ వస్తుందని ఎవరూ అనుకోలేదు. ప్రస్తుతం సానుభూతి లేదు. అంతకు మించి కుటుబంంలో చీలిక వచ్చింది. సోదరి షర్మిల (sharmila) ఏపీ పీసీసీ చీఫ్ (AP PCC chief) అయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను వెనక్కి తెచ్చుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ముస్లిం, దళిత ఓట్లు కడపలో ఎక్కువగా కాంగ్రెస్ కు పడ్డాయి. కడప సిటీలో ఇరవై ఐదు వేల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి. అదే సమయలో కడప పార్లమెంట్ నియోజకవర్గంలో.. నాలుగు చోట్ల టీడీపీ గెలిచింది. ఇలాంటి సమయంలో ఉపఎన్నికలకు వెళ్లడం అంటే ఊహించనంత రిస్క్ అనే భావన ఉంది.
టీడీపీ అధికారంలో ఉండగా..
పులివెందుల, కడప (Pulivendula, Kadapa) కంచుకోటలే అయినా ప్రజాస్వామ్యంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం కష్టం. గతంలో నంద్యాల ఉపఎన్నికల్లో జగన్ గెలిచి తీరుతామని పట్టుదలగా ప్రచారం చేశారు. కానీ పాతిక వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికల్లో ఎలా గెలవాలో బాగా తెలుసు. అన్ని వనరులు అందుబాటులో ఉంటాయి. అలాంటి సమయంలో రిస్క్ చేసి వారికి అవకాశం ఇస్తే.. రాజకీయ జీవితాన్ని రిస్క్ లో పెట్టుకున్నట్లేనన్న అభిప్రాయం విస్తృతంగా వ్యక్తమవుతోంది. జగన్ అలాంటి నిర్ణయాలు తీసుకోరని ఎక్కువ మంది అనుకుంటున్నారు. కానీ జగన్ తీసుకున్న నిర్ణయాలన్నీ ఇలా అనూహ్యంగా ఉంటాయని తెలిసిన కొంత మంది మాత్రం ఎప్పుడు ఎాలంటి నిర్ణయం తీసుకుంటారోనని వైసీపీ (ycp)శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. రెండు, మూడు నెలల్లో జగన్ ఓ నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఒక వేళ జగన్ రాజీనామాలు, ఉపఎన్నికలకు మొగ్గితే.. సంచలనాత్మక మలుపులు తిరిగే అవకాశం ఉంది.