Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: కేటీఆర్ ఘాటు వ్యాఖ్య, ప్రజాపాలన అంటే ప్రతీకారాలేనా

KTR: ప్రజా దీవెన, హైదరాబాద్‌: ప్రజాపాలన అంటే పాలకులు, అధికారుల నిర్లక్ష్యంపై గొంతెత్తి చెప్తే దాడులు చేయడమా అని బీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని నార్యనాయక్‌ తండాలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్‌ దాడి అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. నిన్న సాతాపూర్‌లో జరిగిన దాడి మరవముందే మరోసారి బీఆర్‌ఎస్‌ శ్రేణులపై ఇలా దాడి చేసిన ఘటన చూస్తే, కాంగ్రెస్‌ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని అర్థమవుతోందని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ నేతలు వరుస దాడులకు పాల్పడుతున్నా పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమై అధికార పార్టీకి వత్తాసుపలుకున్నారు అని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజల గొంతు వినిపించిన వారిపై విచక్షణా రహితంగా దాడిచేయడమేనా..? ఇందిరమ్మ రాజ్యం నాటి ఎమర్జెన్సీ రోజులకు కొల్లాపూర్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ పాలనలో పదేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫ్యాక్షన్‌ తరహా దాడులు పెరిగిపోయాయని కేటీఆర్‌ తెలిపారు.

మంత్రి జూపల్లి అండదండలతోనే ఈ విష సంస్కృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి దాడులకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటాం.. ఇప్పటికైనా పోలీసుశాఖ బాధ్యతగా వ్యవహరించి దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు.