–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక
District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : డెంగ్యూ పేరుతో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఒకవేళ అలా ఎవరైనా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. అలా ఇబ్బందులు సృష్టించే వారిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆమె ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా లోని వైద్య అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేపటినుండి జిల్లా వ్యాప్తంగా మరోసారి మరో జ్వర సర్వేను నిర్వహించాలన్నారు.
సీజనల్ వ్యాధుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, సీజన్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని, అన్ని మందులను అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రతి వైద్యాధికారి తన పరిధిలోని పాఠశాలలను, హాస్టల్లను తప్పనిసరిగా సందర్శించి అవసరమైతే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలన్నారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్వోలు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, వైద్యాధికారులు, తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు.