Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Suicide : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

— పరిస్థితి విషమం

–ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

–భూ వివాదమే కారణం

Suicide :  ప్రజాదీవెన నల్గొండ టౌన్ : భూవివాదంలో తనకు న్యాయం చేయకుండా తనపైనే అక్రమ కేసు నమోదు చేసి పోలీసులు వేధిస్తున్నారన్న మనస్థాపంతో బోధనపు సైదిరెడ్డి అనే రైతు క్రిమిసంహారకమందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. చావు బ్రతుకుల మధ్య ఉన్న రైతు సైదిరెడ్డి నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోధనపు సైదిరెడ్డికి ఎర్రబెల్లి గ్రామంలో సర్వేనెంబర్ 100 లో 4.16 ఎకరాల భూమి ఉంది. భూమి పక్కనే ఉన్న రైతు మొల్క శ్రీనివాస్ రెడ్డి తో గత కొంతకాలంగా వివాదం నెలకొంది. ఈ క్రమంలో రైతు బోధనపు సైదిరెడ్డి కోర్టును ఆశ్రయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రత్యర్థి మొల్క శ్రీనివాస్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న ఎస్ఐ ఈనెల 4 వ తేదీన పోలీస్ స్టేషన్ కి పిలిపించి సైదిరెడ్డిని బెదిరించడమే కాక తాసిల్దార్ ముందు బైండోవర్ చేశాడని కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో తనకు న్యాయం జరగదని ప్రత్యర్థి తో చేతులు కలిపిన ఎస్సై తనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నాడని మనస్తాపం చెందిన సైదిరెడ్డి క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు జరిగిన అన్యాయంపై జిల్లా ఎస్పీని కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు.

 

—పోలీసుల జోక్యం ఏమీ లేదు…

 

( సురేష్ ఎస్సై )

 

పక్క భూమి యజమాని ముల్క శ్రీనివాస్ రెడ్డితో కొంతకాలంగా బోధనపు సైదిరెడ్డికి వివాదం నెలకొందని ఇప్పటికే సైదిరెడ్డి పై రెండు కేసులు నమోదయి ఉన్నాయని నిడుమనూరు ఎస్సై సురేష్ చెప్పారు. గతంలో సైదిరెడ్డి మొల్క శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాతి కడీలను ధ్వంసం చేశాడని చెప్పారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్న విషయం వాస్తవమే అన్నారు. మొల్క శ్రీనివాస్ రెడ్డి కి ఆయన పొలానికి వెళ్లకుండా ఇబ్బందులు సృష్టిస్తుండడంతో స్టేషన్కు తీసుకొచ్చి తహసిల్దార్ ముందు బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. ఇందులో పోలీసుల జోక్యం ఏమీ లేదని సైదిరెడ్డిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని ఆయన చెప్పారు.