–బిల్లుపై విపక్షాల పెదవివిరుపు, తీవ్ర అభ్యంతరం
–ముస్లిం సమాజం మెచ్చుకునే బిల్లుగా పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం
Minister Kiran Rijiju: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఇండియా కూటమి పక్షాల నిరసన మధ్య కేంద్రప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును (Waqf Board Amendment Bill) లోక్‌సభలో మై నార్టీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజం మెచ్చుకునేదిగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు చట్టంలో ఉన్న లొసుగులను సరిచేయడం కోసమే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని సరిగ్గా రూపొందించలేదన్నారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని (Constitution)ఏ అధికరణకు వ్యతిరేకంగా లేదన్నారు. రాజకీయ కారణాలతో బిల్లు తీసుకొచ్చారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కిరణ్ రిజిజు సభలో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో న్యాయం అందిరకీ ఒకేలా ఉండాలన్నారు. మతాలవారీ న్యాయం ఉండదన్నారు. ఈ బిల్లు ద్వారా ఎవరి హక్కులను హరించడంలేదని, ముస్లిం సమాజంలో అందరికీ హక్కులు కల్పించే ఉద్దేశంతో ఈ సవరణ బిల్లు తీసుకొస్తున్నామన్నారు.
బిల్లుపై సంప్రదింపులు చేయకుండా.. ఏకపక్షంగా తీసుకొచ్చారని విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 2014 తర్వాత వక్ఫ్ బోర్డు చట్టంపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించామని, ఎంతోమంది ప్రజలతో మాట్లాడి.. వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు. అనేకమంది ముస్లిం పెద్దలు, ముస్లిం సంస్థలను కలిసి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుని దానికి అనుగుణంగా బిల్లు తీసుకొచ్చినట్లు కిరణ్ రిజిజు చెప్పారు. ఆన్‌లైన్‌లో (Online) కూడా ప్రజల అభిప్రాయాలు స్వీకరించామన్నారు. ఎవరిని సంప్రదించకుండా బిల్లు తీసుకొచ్చామనడం సరికాదన్నారు.
మాఫియాల నాయకత్వంలో వక్ఫ్… వక్ఫ్‌బోర్డుల పేరుతో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ఎందరో ముస్లింలు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. మాఫియా నాయకత్వంలో వక్ఫ్‌బోర్డులు నడు స్తున్నాయని చెప్పారని, వాళ్లపేర్లు తాను సభలో చెప్పడం సమంజసం కాదన్నారు. ఎందరో సామాన్య ప్రజ లతో మాట్లాడిన తర్వాత వక్ఫ్‌బోర్డు చట్టంలో సవరణలు తేవాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నా రు. ఢిల్లీ, పాట్నా, లక్నో, జమ్ము- కశ్మీర్‌లో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నామన్నా రు. ఏపీ, అస్సాం, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జ మ్మూ, కర్ణాటక, తెలంగాణ, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి ముస్లిం సంస్థల ప్రతినిధులు వచ్చి వక్ఫ్‌బోర్డులో అక్రమాలు, అవకతవకలపై ఫిర్యాదులు చేశారని, వక్ఫ్‌బోర్డును కాపాడటంతో పాటు ఇప్పటివరకు అవకాశాలు పొందని ముస్లిం సమా జం అవకాశాలు పొందే విధంగా సవరణలు తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju)తెలిపారు.
వక్ఫ్‌బోర్డు చట్టంలో సవరణలు తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఈ విషయంలో విపక్షాలు రాజకీయం చేయవద్దని కిరణ్ రిజిజు కోరారు. ఈబిల్లును వ్యతిరేకించే వ్యక్తులను ముస్లిం సమాజం క్షమించదన్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చే వ్యక్తులను సామాన్య ముస్లింలు ఎప్పటికీ గుర్తించుకుంటారని తెలిపారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కొన్ని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించడం సరికాదన్నారు. ప్రతి సభ్యుడు ఈ బిల్లుకు మద్దతు తెలిపాలని కిరణ్ రిజిజు కోరారు.