–ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి
MLA Jaiveer Reddy :
ప్రజాదీవెన నల్గొండ :ధరణి వల్ల రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని, ప్రత్యేకంగా భూ వివాదాలు, గట్ల పంచాయతీ వంటివి ఎన్నో పరిష్కారం కానీ సమస్యలను ఎదుర్కొన్నారని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. భూ భారతి చట్టం పై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా శనివారం అయన నల్గొండ జిల్లా, గుర్రంపోడు మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ధరణి చట్టంలోని రైతుల ఇబ్బందులను తీర్చేందుకు కొత్త చట్టం తీసుకురావాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నరలోపే భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయని, భవిష్యత్తులో ఈ రాష్ట్రాలు ఈ చట్టాన్ని అవలంబించేందుకు ఆస్కారం ఉందన్నారు. భూ సమస్యలన్నింటిని భూ భారతిలో తీర్చడం జరుగుతుందని చెప్పారు. భూ భారతి చట్టంపై ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. అయితే భూ సమస్యలన్నీ తహసిల్దార్, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కారమైనప్పటికీ కొన్ని కేసులు కోర్టు స్థాయిలో మాత్రమే పరిష్కారం అవుతాయని, అలాంటి వాటి పట్ల రైతులు వేచి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే అధికారులు ప్రతి గ్రామాన్ని సందర్శించి రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోబోతున్నారని ఆయన వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ధరణిలో చేసిన తప్పులను ఇప్పుడు సరి చేసుకోవచ్చని చెప్పారు. రికార్డుల సవరణతో పాటు, రికార్డుల నిర్వహణ, భద్రపరచడం ప్రతి సంవత్సరం రికార్డులను ప్రదర్శించే వేసులు బాటు భూ భారతిలో ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయిలో అన్ని వర్గాలతో ఆలోచించి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, రైతులు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంచార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డిలు భూ భారతి చట్టం ప్రాధాన్యతను తెలియజేశారు. అంతేకాక ధరణి పోర్టల్ లో ఉన్న సమస్యలను రైతులకు వివరించారు.
మండల ప్రత్యేక అధికారి, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్,గుర్రంపొడ్ తహసిల్దార్ ఫరీదుద్దిన్, ఎంపిడిఓ మంజుల, తదితరులు హాజరయ్యారు