— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda District Collector Tripathi : ప్రజాధీవన, నల్లగొండ:విద్య ,మహిళల బలోపేతానికి మహాత్మా జ్యోతిబాపూలే చేసిన కృషి అపూర్వమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు .మహాత్మా జ్యోతిబాపూలే 199 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతిబాపూలే సాధించిన ఘనత దేశానికి మార్గదర్శకమైందని , చదువు కోసం ,మహిళల సాధికారత కోసం ఆయన చేసిన కృషి అపూర్వమని అన్నారు. సామాజిక ఉద్యమకారునిగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా ,అన్ని వర్గాల సమానత్వానికి కృషి చేసిన మహాత్మ జ్యోతిబాపూలే సేవలు నేటి సమాజం ఆచరిస్తున్నదని అన్నారు. జ్యోతిబాపూలే చేసిన సేవలను నేటి విద్యార్థులకు, చిన్న పిల్లలకు అధికారులు, సామాజికవేత్తలు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుల ,మత, వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసి చదువుకునేలా ఒక్కొటి 200 కోట్ల రూపాయలతో “యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను” రాష్ట్రవ్యాప్తంగా స్థాపిస్తున్నదని, ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో 6 పాఠశాలలు మంజూరయ్యాయని, ఇందులో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ అన్ని వర్గాల పిల్లలు ఉంటారన్నారు. మూడో విడత దేవరకొండకు కుడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల మంజూరయ్యిందని తెలిపారు.కష్టపడి చదవటం తప్పా, చదువుకు దగ్గరి దారులు లేవని, ఆందువల్ల విద్యార్థులు బాగా చదవాలని, ప్రతి ఒక్కరు జ్యోతిబాపూలేని ఆదర్శంగా తీసుకొని బాగుపడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి హాజరైన శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిబాపూలే అని కొనియాడారు. సమానత్వం లేని కాలంలో “సత్యశోధక సమాజాన్ని” ఏర్పాటు చేసి సమానత్వానికి కృషి చేశారన్నారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడడమే కాకుండా, సంఘసంస్కర్తగా సేవలందించారని తెలిపారు. స్వాతంత్రం సాధించి 79 సంవత్సరాలైనప్పటికీ ఇంకా సమాజంలో కుల వివక్షత, రెండు గ్లాసుల విధానం అక్కడక్కడ అంటరానితనం ఉందని,వీటిని రూపుమాపేందుకు, మహాత్మ జ్యోతిబాపూలే ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలన,కుల వివక్షత, మహిళ విద్యకు కృషి చేసిన జ్యోతిబాపూలే మహానీయుడని అన్నారు .వారి త్యాగాల ఫలితంగానే సమాజంలో నేడు మార్పులు వచ్చాయని ,ఆనాటి పరిస్థితులు, నేటి పరిస్థితులు వేరైనప్పటికీ, మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే విషయంపై ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే విద్య ప్రాముఖ్యతను విస్తరింప చేశారని, ప్రత్యేకించి మహిళల విద్యకు కృషి చేశారని, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు ,అణగారిన కులాలను పైకి తీసుకువచ్చేందుకు తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు.
విశ్రాంత ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ , సంఘాల నాయకులు లక్ష్మీనారాయణ, చక్రధర్ తదితరులు మాట్లాడారు.
అడిషనల్ ఎస్పీ రమేష్, జెడ్పి సీఈవో ప్రేమ్ కరన్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ,నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి ,డిఎస్పి శివరామిరెడ్డి, సహాయ బీసీ సంక్షేమ అధికారి సంజీవ, ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులు కార్యక్రమానికి హాజరై మహాత్మ జ్యోతిబాపూలేకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాగా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యం లో తెలంగాణ సాంస్కృ తి సారథి కళాకారులు మహాత్మ జ్యోతిబాపూ లే గొప్పత నాన్ని తమ సాంస్కృతి క కార్యక్రమాల ద్వారా ఆహు తులకు తెలియజేశారు.