–కుంభకోణాల నుంచి పక్కదారి పట్టించేందుకే లేనిపోని ఆరో పణలు
–రాష్ట్రంలోని విద్యార్థులంతా నా బిడ్డల్లాంటివారే వారి బాధ్యత నాదే
–జగన్ మాదిరి తల్లీ, చెల్లిని రోడ్లపై కి గెంటేసే రకం నేను కాదు
–మంగళగిరి నియోజకవర్గ పర్యట నలో మంత్రి నారా లోకేష్ ధ్వజం
Nara Lokesh: ప్రజా దీవెన, మంగళగిరి: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాత్రూమ్ లలో హిడెన్ కెమెరాలు బ్లూమీడియా సృష్టి మాత్రమేనని, అక్కడ కెమెరాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో (Mangalagiri Constituency)ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కార్పొరేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ… వైసిపి నేతల సినీనటి వేధింపుల కేసు, మద్యం కుంభకోణం, భూ అక్రమాలు వరుసగా బయల్పడుతుండటంతో వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే హిడెన్ కెమెరాల నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో చదివే విద్యార్థులంతా నా బిడ్డల్లాంటి వారేనని, వారిని క్షేమంగా కాపాడుకునే బాధ్యత పూర్తిగా తమదేనని అన్నారు. గుడ్లవల్లేరులో నలుగురు విద్యార్థుల మధ్య జరిగిన ఒక వ్యక్తిగత అంశం ఈ గొడవకు కారణమైందని, సంబంధిత విద్యార్థిని డీటెయిన్ (Detain)చేసి ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
నూజివీడు ట్రిపుల్ ఐటిలో (Triple IT) ఆహారం కలుషితమైందని తెలిసిన వెంటనే డైరక్టర్ ను విధులనుంచి తొలగించామని, ముగ్గురు ఉన్నతాధికారులతో పర్యవేక్షక (supervisor) కమిటీని నియమించామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)మాదిరిగా తాను తల్లీ, చెల్లిని రోడ్లపైకి గెంటేసే రకం కాదని, విద్యార్థినులను తన తోబుట్టువులుగా భావించి కంటికి రెప్పలా కాపాడతానని స్పష్టంచేశారు. నాడు-నేడు పేరుతో జగన్ ప్రభుత్వం వేలకోట్ల ఖర్చుచేసినట్లు తప్పుడు లెక్కలు చెబుతోందని, అదే నిజమైతే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో గత అయిదేళ్లలో 10లక్షల మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని నిలదీశారు.
డిజిటల్ క్లాస్ రూమ్ (Digital classroom) లు జగన్ కొత్తగా ఏమీ కనిపెట్టలేదని, అవి అంతకుముందే ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వపాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా రంగులు వేసి వందలకోట్లు దిగమింగారని దుయ్యబట్టారు. విద్యార్థులకు సరఫరాచేసే గుడ్లు, చిక్కీలు, ఆయాల జీతాలు కూడా బకాయి పెట్టి వెళ్లారని, వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తాము విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తామని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పష్టంచేశారు.