Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NEET: ‘నీట్ ‘మళ్ళీ అవసరం లేదు

–లీకేజీతో వివాదమైన నీట్ కేసు విచారణ ముగిసింది
–155మంది కోసం 24 లక్షలమంది విద్యార్థులను ఇబ్బంది పెట్టలేము
–పరీక్షలు మళ్ళీ నిర్వహించే ప్రసక్తే లేదు
–తుది తూర్పులో వెల్లడించిన సుప్రీం కోర్టు ధర్మాసనం

NEET: ప్రజాదీవెన, ఢిల్లీ: నీట్‌ (neet)మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు (Supreme Court)స్పష్టం చేసింది. నీట్‌ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. నీట్‌ మళ్లీ నిర్వహించాలన్న విద్యార్థుల, పలువురు రాజకీయ నాయకుల డిమాండ్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైన నేపథ్యంలో పిటిషన్ ను స్వీకరించింది సుప్రీం కోర్టు. ఆ విచారణ సందర్భంగా నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని ధర్మాసనం నిర్ధారించింది. బీహార్‎లోని (bihar)హజారీబాగ్, పాట్నాలోనూ పేపర్ లీకైందని తెలిపింది. 155 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్‎తో లబ్ధి పొందారని సీజేఐ బెంచ్ వెల్లడించింది.

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌, బిహార్‌లోని (bihar) పట్నాలోని కేంద్రాల్లో నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకైందన్న మాట వాస్తవమని సీబీఐ దర్యాప్తు సమాచారం ప్రకారం దాదాపు 155 మంది లబ్ధిపొందినట్లు తెలుస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. పేపర్‌ లీకేజ్ ద్వారా లబ్ధిపొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని.. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధారణకు రావడం ప్రస్తుత దశలో కష్టమని ధర్మాసనం అభిప్రాయ పడింది. మళ్లీ పరీక్ష పెడితే ఇప్పటి వరకూ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని అభిప్రాయంపడింది.

వారిలో అనేకమంది వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు వెళ్లి నీట్ ఎగ్జామ్‌ రాసారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (DY Chandrachud)తెలిపారు. ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లోనీట్‌ ప్రవేశ పరీక్ష జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్‌ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్‌ మార్కులు (Grace marks) కారణమని విద్యార్థులు ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే ‘ఫిజిక్స్‌ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండేతో పాటు మరి కొందరు నీట్ పేపర్‌ లీక్‌పై (NEET Paper Leak)సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.