ప్రజాదీవెన, తెలంగాణ బ్యూరో: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 9, 2024న, హరియాణాలోని పానిపట్ లో బీమా సఖి పథకాన్ని ప్రారంభించారు. ఇది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పథకం. ఈ స్కీమ్‌ను మహిళల కోసమే ప్రత్యేకంగా ప్రారంభించారు, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యం. ఈ పథకంలో చేరిన మహిళలను బీమా సఖులు అని పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు (బీమా సఖులు) కూడా ప్రజలకు బీమా చేసేలా వారికి శిక్షణ ఇస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో, బీమా సఖులకు ఎల్ఐసీ నుంచి స్టైపెండ్ అందుతుంది.
బీమా సఖి పథకం అంటే ఏమిటి?
బీమా సఖి యోజన అనేది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మహిళల కోసం ప్రారంభించిన ప్రత్యేక పథకం. ఇందులో 18 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలు లబ్ధిదార్లుగా చేరొచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. పథకానికి ఎంపిక కాగానే, ఆ మహిళ బీమా సఖిగా మారుతుంది. ఈ పథకం కింద బీమా సఖులకు 3 సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తారు. ఆ సమయంలో వారికి బీమా సంబంధిత విషయాలపై అవగాహన కల్పిస్తారు. బీమా ఆవశ్యకతను వివరిస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు వారి ప్రాంతంలోని ప్రజలకు బీమా గురించి మరింత మెరుగైన సమాచారాన్ని అందించగలరు. శిక్షణ సమయంలో మహిళలకు స్టైఫండ్ లభిస్తుంది. శిక్షణ పూర్తయిన తర్వాత వారు LIC ఏజెంట్‌గా నియామకం పొందుతారు. BA ఉత్తీర్ణులైన మహిళలు ‘డెవలప్మెంట్ ఆఫీసర్’గా కూడా అవకాశం పొందవచ్చు.
ఎంత డబ్బు వస్తుంది, ఎప్పుడు వస్తుంది?
బీమా సఖి శిక్షణ కాలంలో… మొదటి సంవత్సరం ప్రతి నెలా రూ. 7,000, రెండో సంవత్సరంలో ప్రతి నెలా రూ. 6,000, మూడో ఏడాదిలో ప్రతి నెలా రూ. 5,000 అందజేస్తారు. అంటే మొత్తం మూడేళ్ల శిక్షణ కాలంలో మహిళలకు రూ. 2 లక్షలకు పైగా (రూ. 2,16,000) అందుతుంది. దీనికి అదనంగా, వారికి బోనస్ & కమీషన్ ఇస్తారు. విక్రయించే పాలసీలలో 65% టాక్స్ ఎఫెక్టివ్‌గా ఉంటేనే మహిళలు ఈ అదనపు మొత్తాలు పొందారు.
బీమా సఖి పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
బీమా సఖి యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి, మహిళలు LIC అధికారిక వెబ్సైట్ https://licindia.in/test2 ను సందర్శించాలి. వెబ్ పేజీలో కనిపించే ‘Click here for Bima Sakhi’ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మరో కొత్త వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆ మహిళ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ID, చిరునామా వంటి వివరాలను పూరించాలి. మీరు ఏవరైనా LIC ఏజెంట్/డెవలప్మెంట్ ఆఫీసర్/ఉద్యోగి/మెడికల్ ఎగ్జామినర్‌తో అనుబంధం ఉంటే, అతని వివరాలను కూడా నమోదు చేయాలి. చివరగా క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి ‘Submit’ బటన్ మీద క్లిక్ చేయండి.