Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PM Modi: ఆన్‌లైన్‌ మోసగాళ్ల బారిన పడొద్దు

● ‘మన్‌ కీ బాత్‌’లో ప్రజలకు ప్రధాని సూచన

● సైబర్‌నేరాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ చేసిన ట్వీట్‌ను ప్రస్తావించిన మోదీ

● చేర్యాల నకాశీ కళాకారుడు ధనాలకోట వైకుంఠంపై ప్రశంసల జల్లు

PM Modi: న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, చేర్యాల, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఈ రోజుల్లో సైబర్‌ నేరాలు ప్రధాన సమస్యగా మారాయని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్‌ అరెస్టులు, ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలకు మరింత అవగాహన అవసరమన్నారు. మోసగాళ్లు తాము పోలీసులుగా, సీబీఐ, ఆర్‌బీఐ, నార్కోటిక్స్‌ (CBI, RBI, Narcotics)అధికారులుగా పరిచయం చేసుకొని వ్యక్తిగత సమాచారాన్ని రాబడతారని, తర్వాత ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా నిర్ణీత సమయంలోగా డబ్బులు చెల్లించాలని భయపెడుతూ ఒత్తిడి చేస్తారని తెలిపారు. ఆదివారం ప్రసారమైన 115వ ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ సైబర్‌ నేరాల అంశాన్ని ప్రస్తావించారు. సైబర్‌ దాడుల (Cyber ​​attacks) నుంచి ప్రజలను కాపాడేందుకు అనేక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.

ఈ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ‘ఆగి… ఆలోచించి… ఆ తర్వాత నిర్ణయించండి..’ అనే మూడు అంచెల విధానాన్ని పాటించాలని ప్రజలకు సూచించారు. ‘చట్టంలో డిజిటల్‌ అరెస్టు వంటి ప్రక్రియ లేనేలేదు. ఇది నేరగాళ్ల ముఠా చేసే మోసం. ఏ ప్రభుత్వ సంస్థా మిమ్మల్ని డిజిటల్‌ అరెస్ట్‌ చేయదు. ఫోన్లు చేసి డబ్బులు చెల్లించాలని బెదిరించదు. ప్రశాంతంగా ఆలోచించండి… వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దు.. వీలైతే స్క్రీన్‌ షాట్‌ (Screen shot) తీసుకోండి. ఆ కాల్‌ను రికార్డు చేయండి. ప్రభుత్వ సంస్థలు ఎవరినీ బెదిరించవని గుర్తుంచుకోండి… ఇలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే నేషనల్‌ సైబర్‌ హెల్ప్‌లైన్‌ (1930)కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయండి’ అని మోదీ సూచించారు. ఈ సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ (TGSRTC MD VC Sajjanar) గతంలో సైబర్‌నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా చేసిన ఒక ట్వీట్‌ను ప్రధాని ప్రస్తావించారు. కర్ణాటకకు చెందిన సందీప్‌ పాటిల్‌.. తనకు వీడియో కాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్ల బారినపడకుండా తప్పించుకోవటమేగాక వారి ప్రయత్నాన్ని వీడియో రికార్డ్‌ చేశాడు. ఈ వీడియోను సజ్జనార్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసి ఈతరహా మోసాల గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ ట్వీట్‌ను ప్రధాని ప్రస్తావించటమేగాక పాటిల్‌ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. దీనిపై ప్రధానికి సజ్జనార్‌ ధన్యవాదాలు తెలిపారు.

యానిమేషన్‌ పవర్‌హౌస్‌గా భారత్‌

యానిమేషన్‌ ప్రపంచంలో (The world of animation) కొత్త విప్లవానికి నాంది పలికేదిశగా భారత్‌ ముందుకెళ్తోందని ప్రధాని చెప్పారు. దేశాన్ని యానిమేషన్‌ పవర్‌ హౌస్‌గా మార్చేందుకు సహకరించాలన్నారు. భారత్‌లోని యానిమేషన్‌ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందంటూ.. ‘చోటా భీమ్‌’, ‘హనుమాన్‌’, ‘మోటు–పట్లూ..’వంటి సిరీస్‌లను గుర్తుచేశారు. యానిమేషన్‌ ప్రపంచంలో ‘మేడిన్‌ ఇండియా’, ‘మేడ్‌ బై ఇండియన్స్‌’ ప్రతిచోటా కనిపిస్తాయన్నారు.

50 ఏళ్లుగా ధనాలకోట వైకుంఠం కృషి…

చేతివృత్తుల కళారంగాల్లో కృషి చేస్తున్న పలువురిని ప్రధాని ప్రశంసించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల నకాశీ చిత్రకళను ప్రస్తావించారు. నకాశీ కళాకారుడైన ధనాలకోట వెంకటరామయ్య చిన్నకుమారుడు ధనాలకోట వైకుంఠం 50ఏళ్లుగా చేర్యాల జానపద, చిత్రకళను ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నారని, అరుదైన కళ పరిరక్షణలో ఆయన కృషి అద్భుతమని మోదీ (modi) కొనియాడారు. చేర్యాల పెయింటింగ్స్‌ ప్రత్యేకమని, స్క్రోల్‌ రూపంలో కథలను కళ్లకు కట్టినట్లుగా ముందుకు తీసుకువస్తాయని, వీటిలో మన చరిత్ర, పురాణాల గురించి ఉంటుందన్నారు. ఛత్తీ స్‌గఢ్‌లోని నారాయణపూర్‌కు చెందిన బుట్లూరామ్‌ మాత్రాజీ అబూజ్‌ మాడియా తెగకు చెందిన జానపద కళలను సంరక్షించటానికి ఎంతో కృషి చేస్తున్నారని ప్రధాని ప్రశంసించారు.