–రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు లు మృతి, బావిలో దూకి తల్లి కూతుళ్ళ ఆత్మహత్యలు
–వరుస దుర్ఘటనలతో దుఃఖంలో కుటుంబాలు
–దర్యాప్తు కొనసాగిస్తున్న ఏపీ పోలీసులు
Road Accident: ప్రజాదీవెన, ఏపీ బ్యూరో: ఏపీలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో (NTR district)జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోగా.. చిత్తూరు జిల్లాలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు (suicide)పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లాలో ఒకే చోట మూడు ప్రమాదాలు జరిగాయి. ఓ ప్రమాదం జరగ్గా దాన్ని చూసేందుకు వెళ్లిన తండ్రీ కొడుకులపై (father son)మరో లారీ దూసుకెళ్లి వారు ప్రాణాలు కోల్పోయారు. నందిగామ మండలం ఐతవరంలో 65వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న గ్యాస్ సిలిండర్ లోడ్ లారీని అటుగా వస్తోన్న మరో లారీ ఢీకొట్టింది. అర్ధరాత్రి సమయంలో పెద్ద శబ్దం రావడంతో ఏం జరిగిందో చూడడానికి వచ్చిన తండ్రీ కొడుకులపై మరో లారీ దూసుకెళ్లింది. ఈ క్రమంలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు( police )ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు ఐతవరం గ్రామానికి చెందిన సంకు మాధవరావు, రామరాజుగా గుర్తించారు. వీరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
అదే చోట మరో ప్రమాదం
అయితే, ఈ 3 లారీలు ఢీకొట్టి ప్రమాదం జరిగిన చోట ఓ కంటైనర్ డ్రైవర్ కంగారు పడి అతి వేగంగా కంటైనర్‌ను (container)మలుపు తిప్పాడు. ఈ క్రమంలో అదుపు తప్పి విశాఖ వెళ్తున్న ఓ సూపర్ లగ్జరీ బస్సును ఢీకొట్టాడు. అయితే, బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు పిల్లలతో సహా..
మరోవైపు, చిత్తూరు జిల్లా పుంగనూరులో(punganur)తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. సోమల మండలం ఆవులపల్లి పంచాయితీ పట్రపల్లెలో ఈ ఘటన జరిగింది. రాయలపేటకు చెందిన దిలీప్‌తో పట్రపల్లెకు చెందిన రాణి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు జ్యోతి (3), హిమశ్రీ (4). పట్రపల్లెలో జరిగే గంగ జాతర నిమిత్తం రాణి తన పుట్టింటికి పిల్లలతో కలిసి వచ్చింది. ఉదయం తల్లిదండ్రులకు తమ కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనతో చుట్టుపక్కల వెతికారు. ఊరిబయట బావిలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరు పిల్లలతో సహా తమ బిడ్డను విగతజీవిగా చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివాహిత ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా.? లేక మరేదైనా కారణమా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.