Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 August 2025, 5:36 pm Posted by : praja deveena

Chairman Bhavesh Mishra : శాండ్ బజార్ తో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట

–రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విసి భవేష్ మిశ్రా

Chairman Bhavesh Mishra : ప్రజాదీవెన నల్గొండ : అందరికీ అందుబాటు ధరలో ఉంచేందుకుగాను మిర్యాలగూడ పట్టణంలో శాండ్ బజార్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విసి, ఎండి భవేష్ మిశ్రా అన్నారు.

గురువారం అయన నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి ఎక్స్ రోడ్ వద్ద మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శాండ్ బజార్ ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాండ్ బజార్ ఏర్పాటు వల్ల ఇసుక అక్రమ రవాణాను అరికట్టవచ్చని, ఇసుక అవసరమైన వారందరికీ సులభంగా అందుబాటు ధరలో లభ్యమవుతుందని తెలిపారు. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో అందరికీ కావాల్సిన ఇసుక లభ్యమయ్యే విధంగా శాండ్ బజార్ ఏర్పాటు చేశామన్నారు. సామాన్యులకు ఇసుకను అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో టన్ను 1250 రూపాయలకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ఈ శాండ్ బజార్ ద్వారా అందించే ఇసుకను నామమాత్రపు ధరకు అందించడం జరుగుతుందని, ఎలాంటి టాక్స్, ఇతర ఖర్చులు ఉండవని తెలిపారు. దూరాన్ని బట్టి ఇసుక ధర ఉంటుందన్నారు.

వంగ మర్తి నుండి వచ్చే వాహనాలపై గట్టి నిఘా పెడతామని చెప్పారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, ప్రజలకు, ఇసుక అవసరమైన వారికి తక్కువ ధరకే ఇసుక అందించే విధంగా శాండ్ బజార్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు అవసరమైన ఇసుకను ఉచితంగా ఇవ్వడమే కాకుండా, ఇటుక, సిమెంటు, స్టీలు వంటి వాటిని తక్కువ ధరలో అందించేందుకు సంబంధిత ట్రేడర్స్ తో మాట్లాడడం జరిగిందని అన్నారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మిర్యాలగూడ ప్రాంతంలో ఇసుక రీచులు లేనందున శాండ్ బజార్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరం ఉన్న ప్రజలు, ప్రభుత్వ శాఖలు ఈ శాండ్ బజార్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో మిర్యాలగూడ శాండ్ బజార్ ద్వారా ఇసుక సరఫరాను పెంచితే సిబ్బంది ఎక్కువ అవసరమవుతారని, అందువల్ల ఎక్కువ మంది సిబ్బందిని కేటాయించి అందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిని కోరారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా సహాయ సంచాలకులు శామ్యూల్ జాకబ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసిల్దార్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.