Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Unseasonal Heat in Monsoon : వానాకాలంలో “సూర్య ప్రతాపం”

–వేసవిని తలపిస్తున్న ఎండలు

–ఆగస్టు పైనే రైతుల ఆశలు

Unseasonal Heat in Monsoon : ప్రజాదీవెన నల్గొండ : వానాకాలంలో ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటుతుండగా జిల్లావ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రత లు 35 డిగ్రీలు దాటుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల నుంచి సూర్యుడి ప్రతాపం రోజు రోజుకు పెరుగుతోంది. అపుడప్పుడు కురుస్తున్న చిరుజల్లులు ఎండ తీవ్రతను తగ్గించలేకపోవడంతో పగలు ఎండ, ఉక్కపోత తో జనం అల్లాడుతున్నారు. వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండ కాస్తుండటంతో సామాన్య ప్రజలతోపాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. పంటలకు సాగునీళ్లందించేం దుకు పడరానిపాట్లు పడుతున్నారు. ఆగస్టులో నైనా భారీ వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు నిరీక్షిస్తున్నారు.

 

–ఉదయం 9 గంటలకే..

 

పగటిపూట ఎండ వేసవిని తలపిస్తోంది. ఉదయం 9 గంటలు దాటితే సుర్రుమంటోంది. సాయంత్రం సమయంలో వాతావరణం చల బడుతున్నా ఉక్కపోతతో ప్రజలు రాత్రంతా ఇబ్బందిపడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్ప డిన అల్పపీడన ప్రభావంతో ఆరు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసినా అనంతరం వరు ణుడు ముఖం చాటేయడంతో క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. మరో మూడురోజుల పాటు ఎండల తీవ్రత ఉండే అవకాశముందని

వాతావరణశాఖ సూచనలు జారీ చేస్తోంది.

 

–జ్వరాల బారిన జనం…

 

జిల్లా వ్యాప్తంగా నెలకొన్న అసాధారణ వాతావరణ ప్రభావంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, ఉక్కపోత కారణంగా చర్మవ్యాధులు, జ్వరం, జలుబు, గొంతునొప్పి తదితర వ్యాధులు ప్రబలుతున్నాయి. పలు గ్రామాల్లో పారిశుధ్య లోపంతో వైరల్ జ్వరాలు వ్యాపించడంతో బాధి తులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

 

—ఆకాశంవైపు ఆశగా…

 

కార్తెలన్నీ కరిగిపోతున్నాయే తప్ప వర్షాలు మాత్రం కురవడంలేదు. రోజూ ఆకాశంలో కమ్ము కుంటున్న మేఘాలు వర్షించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ ఆరంభంలో మురిపించిన వరుణుడు అనంతరం ముఖం చాటేయడంతో జిల్లాలో వర్షభావ పరిస్థి తులు నెలకొన్నాయి. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీళ్లు చేరలేదు. జిల్లావ్యాప్తంగా సగటు ఇప్పటి వరకు 218.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇంకా 0.1శాతం లోటు వర్షపాతం నమోదయింది.కాగా జిల్లాలోని కొన్ని మండలాలలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా ఎక్కువ మండలాలలో లోటు వర్షపాతమే నమోదయింది.

బావులు, బోర్లపై ఆధార పడిన రైతులు పొలాలను దున్ని వరినాట్లేస్తున్నారు. వర్షాలు కురవకపోతే బావులు, బోర్లు కూడా ఎండిపోతాయేమోనని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఆగస్టులో నైనా వర్షాలు కురుస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు.