ప్రజా దీవెన, ముంబాయి: 2019లో శ్యాం బెనెగల్‌ను ముంబైలో కార్టూనిస్టు చిలువేరు మృత్యుంజయ్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన తో బెనెగల్ గత జ్ఞాప కాలను పంచుకున్నారు. 1985లో తీసిన సుస్మన్ సినిమా చిత్రీకరణ సంద ర్భంలో చిలువేరు రామలింగంతో ఉన్న మధురమైన జ్ఞాపకాలను యాదిచేసుకున్నారు. ఆ ఇంటర్వ్యూ శ్యాం బెనెగల్‌కు నివాళి గా యథాతథంగా…ముంబైలో థాడ్ దేవ్ రోడ్డు. ఎవరెస్టు బిల్డింగ్.. రెండవ ఫ్లోర్.. దర్శకుడు శ్యాం బెనగల్ ఆఫీసు.. లోపలికి వెళ్లగానే ఎడమవైపు.. పెద్ద సుస్మన్,త్రికాల్ సినిమా పోస్టర్లు .. కుడివైపు అంకుర్, నిషాంత్ పోస్టర్లు. కొంచెం ముందుకు వెళ్లి డోర్ తీయగానే.. అభిముఖంగా తపస్సు చేసుకుంటున్నట్లు ఒంటరిగా 85 ఏళ్ల వయసులో ఎంతో ఎనర్జ్జిటిక్‌గా, చుట్టూ బోలెడు పుస్తకాలు, కాగితాలు, ఫోటోల మధ్య ‘షేక్ ముజీబుర్ రెహ్మాన్’ లైఫ్ స్టోరీ మీద స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నాడు శ్యాం బెనగల్. ముజీబుర్ రెహ్మాన్ కూతురు ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రిక్వెస్ట్ మీద ఈ సినిమా తీసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పని తప్ప వేరే ధ్యాసలేదు.
అయినప్పటికీ నాకు సుమారు గంటన్నర సమయం కేటాయించాడు. సినిమా, తెలంగాణ పల్లె, హైదరాబాద్, భాష రకరకాల అంశాల మీద సుదీర్ఘమైన తన జ్ఞాపకాలను పంచుకున్నాడు.985లో భూదాన్ పోచంపల్లిలో, అలాగే ముక్తాపూర్ గ్రామంలో నేత కార్మికుల ఇతివృత్తం మీద తీసిన సినిమాను నేను బెనగల్‌కు గుర్తు చేశాను. అప్పుడు నేను అయిదో తరగతి. చేనేత కార్మికుల సమస్యలు, సహకార సంఘాల వైఫల్యం, దళారుల దౌర్జన్యంతో అరుదైన చేనేత కళ ఎలా చితికిపోతుందో సుస్మన్ సినిమా చూపెడుతుంది. ఆ సినిమా షూటింగ్ కోసం ఓంపురి, షబానా అజ్మీ, పల్లవి జోషి.. మా ఇంట్లోనే రిహార్సల్స్ చేసేవారు. మా ఇంట్లోనే బస. మా వీధి జాతరలా ఉండేది. బట్టలపై రాజకీయ నేతలను నేయడం, కొత్త డిజైన్లను సృష్టించడం.
కుట్టులేకుండా మూడు కొంగుల చీర. సుస్మన్ సినిమా కోసం పచ్చీసు కుర్తా పైజామా, మగ్గంపై నేసే నేత కళాకారుడైన మా నాయన చిలువేరు రామలింగం సహాయం ఎలా తీసుకున్నారో శ్యాంబెనగల్ చెప్తూ పోయాడు. సుస్మన్ స్క్రిప్ట్ వర్క్ కూడా మా ఇంట్లోనే జరిగిందని కూడా చెప్పాడు. సుస్మన్ సినిమా ప్రధాన పాత్రధారుడు ఓంపురికి మా నాయన మగ్గం నేయడం నేర్పించడమే కాకుండా, ఓంపురి పాత్రకు మా నాయనను రిఫెరెన్స్ గా తీసుకున్నాననీ కూడా చెప్పాడు. బోనాల పండుగ రోజు మా నాయన బండి మీద మగ్గం నేస్తూ గుడికి వెళ్లే లోపు చీర పూర్తి చేసి అమ్మవారికి అప్పటికప్పుడే కట్టించే మా ఊరి సాంప్రదాయాన్ని సుష్మన్ సినిమాలో ఓంపురికి అన్వయిస్తూ సినిమాలో వాడుకున్నది బెనగల్ గుర్తు చేశాడు.
బెంగాల్ నుంచి మృణాల్‌సేన్, సత్యజిత్ రాయ్, కేరళ నుంచి ఆదూరి గోపాలకృష్ణన్ కన్నడ నుంచి పట్టాభి రామిరెడ్డి(సంస్కార చండమార ్త ఫేం), గిరీశ్ కాసరవల్లి, గిరీశ్ కర్నాడ్..ఈ కోవకు చెందిన సూపర్ క్లబ్ డైరక్టర్లు అద్భుతమైన ఆర్ట్ ఫిల్మ్‌లను తీస్తున్నారు. అవి ఇంటలెక్చువల్ సినిమాలు. మామూలు ప్రేక్షకులకు ఎన్నటికీ చేరలేవు. ఇటు డబ్బు దండుకునే పక్కా కమర్షియల్ సినిమాలు, ఫైట్లు, క్లబ్ డాన్సులు, బూతు పాటలతో వేడి వేడి పకోడిలా జనాలను ఊపేస్తున్న కాలం అది. అంత ఆర్టూ పనికి రాదు. ఇంత పచ్చి వ్యాపార సెక్సిజమూ కూడదు. మధ్యే మార్గం ఉందా ? ఖచ్చితంగా ఉంది. ఆ మిడిల్ ఆఫ్ ద రోడ్ ఫిల్మ్‌ను, టెక్నిక్‌ను కనిపెట్టినవాడు శ్యాం బెనగల్. అప్పటిదాకా యాడ్ ఫిల్మ్ తీసుకుంటున్న శ్యాం బెనగల్‌ను గుజరాత్ వైట్ రెవల్యూషన్ పితామహుడు వర్గీస్ కురియన్ పిలిచాడు. ఇక్కడ కోఆపరేటివ్ పద్ధతిలో పాలు సేకరించి, నెయ్యి, స్వీటు,్ల పాలు మార్కెటింగ్ చేస్తున్నాం. దీన్ని ప్రమోట్ చేస్తూ తక్కువ బడ్జెట్‌లో ఒక ఫిల్మ్ చేయగలవా అని అడిగారు.
లెక్కలు వేసిన శ్యాం బెనగల్ ఆరు లక్షలు ఖర్చు అవుతుందన్నారు. గుజరాత్ కోఆపరేటివ్ రైతుల నుంచి తలా ఓ రూపాయి సేకరించి కురియన్ .. శ్యాం బెనగల్‌కు ఆరు లక్షలు ఇచ్చాడు. దాని ఫలితమే ‘మంథన్’ అనే గొప్ప సినిమా తీశాడు. మంథన్ అనగా చిలకడం. దాంట్లో స్మితా పాటిల్ హీరోయిన్. బహుశా అది ఆమె తొలి సినిమా అయి ఉంటుంది. అంకుర్, నిషాంత్‌లతో న్యూ వేవ్ పితామహుడిగా శ్యాం బెనగల్ పేరొందాడు. మరాఠి నటి హంసా వాడేకర్ జీవితం ఆధారంగా అమోల్ పాలేకర్, స్మితా పాటిల్, అమ్రిష్ పురిలతో శ్యాంబెనగల్ తీసిన ”భూమిక’ మరిచిపోలేని సినిమా. కథనం, టెక్నిక్, ైక్లెమాక్స్ .. భారతీయ చలన చిత్ర రంగంలో పూర్తి భిన్నంగా ఉంటాయి. గాంధీజీపై తీసిన ‘మేకింగ్ ఆఫ్ మహాత్మా..’ అంతే అరుదైన సినిమా. సికింద్రాబాద్‌లో పుట్టి, అక్కడే పెరిగిన తెలంగాణ కళాత్మక పతాక శ్యాం బెనగల్. భారతీయ సినిమాను 1980 నాటికే అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టిన వాడు ఆయన. స్మితా పాటిల్, షబానా అజ్మీ అనే రెండు సినీ కళా సౌందర్య దీపాలను మనకు ప్రసాదించిన వాడు శ్యాం బెనగల్.
ఇది శ్యాంబెనల్ సినిమా అని ఇట్టే చెప్పే విలక్షణ శైలి ఆయనది. మెయిన్ స్ట్రీమ్, కమర్షియల్ సినిమా ధాటిని తట్టుకుని, తన సినిమాను నిలబెట్టుకునే చేవ ఉన్నవాడు శ్యాం బెనగల్.’పద్మా వతి’, ‘ప్యాడ్ మాన్’ లాంటి సిన్మాలమీద లీగల్ నోటీసులు జారీచేస్తున్నారన్నప్రస్తావన వచ్చినప్పుడు ఈ సంగతి గుర్తుచేశాను..ప్రముఖ అమెరికన్ హాస్య పత్రిక ‘మ్యాడ్’ హాలీవుడ్ సిన్మాలను పేరడీ చేస్తూ రెగ్యులర్ గా కార్టూన్లు వేసేది. అప్పట్లో ఆ ఫీచర్ బంపర్ హిట్.1980 లో ‘ ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్’ సిన్మా రిలీజైనప్పుడు ‘ ఎంపర్ స్త్రైక్స్ అవుట్’ అంటూ మార్ట్ డ్రక్కర్ గీసిన కార్టూన్ ని వేసింది. ఎప్పట్లాగే ఆ కార్టూనూ సూపర్ డూపర్ హిట్ అయ్యింది, ఆ సిన్మా నిర్మాణ సంస్థ నుంచి ‘మ్యాడ్’ పబ్లిషర్ బిల్ గేయిన్స్ కు వెంటనే మ్యాడ్ మ్యాగజైన్లను మార్కెట్లనుంచి తొలగించాలని అలాగే మ్యాడ్ ప్రతులని దగ్ధం చేయాలని,ఆ సిన్మా నిర్మాణ సంస్థకు పరిహారం చెల్లించాలని లీగల్ నోటిసులు పంపారు. మ్యాడ్ పత్రికకు వీరాభిమాని అయిన సిన్మా నిర్మాత జార్జ్ లూకాస్ ‘ఎంపైర్ ‘ కార్టూన్ అద్భుతమంటూ కార్టూనిస్టు మార్ట్ డ్రక్కర్ ను ఆస్కార్ కు నామినేట్ చేస్తున్నానంటూ ఒక అభినందన లేఖ ను మ్యాడ్ కు పంపాడు. అప్పుడు మ్యాడ్ పత్రిక వాళ్ళు ఆ అభినందన లేఖను లీగల్ నోటీసు జారీచేసిన వారికి పంపడంతో కేసుకథ ముగిసింది.
ఈ సంగతి వినగానే శ్యాం బెనెగల్ ” దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కార్టూనిస్టు ‘ అన్నాడు.ఆయన పంచుకున్న జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే..
పుట్టి పెరిగింది సికింద్రాబాద్‌లోని కంటోన్నెంట్ ఏరియా తిరుమలగిరి. మెహబూబియా హై స్కూల్‌లో చదువు. ఆ తర్వాత నిజాం కాలేజీ. చదవింది హైదరాబాద్‌లో అయినా.. ప్రొఫెషనల్ వర్క్ మాత్రం బాంబేలోనే. అప్పట్లో తెలంగాణలోని 9 జిల్లాల్లో నేను విపరీతంగా తిరిగేవాడిని. తెలంగాణలోని ప్రతి పల్లె నాకు తెలుసు. ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టాలనిపించేదికాదు. ఆ ప్రాంతంతో అంత అటాచ్‌మెంట్ ఉండేది. తెలంగాణలోని సిద్ధిపేటతో పాటు పలు ప్రాంతాల్లో రమణీయమైన పెద్ద పెద్ద రాళ్లు కూర్పు ఉండేది. పంటసాగు సమయంలో పచ్చని పొలాల్లో తెలంగాణ ప్రాంతం కంటికి ఇంపుగా ఉండేది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో కూడా అందమైన ఎత్తైన రాళ్లు ఒద్దిగా ఉండేవి. కానీ ఇప్పుడంతా ధ్వంసమైంది. సుమారు అర్థ శతాబ్ధం నుంచి ఎప్పుడైతే తెలంగాణ..
ఆంధ్రా అజమాయిషీలోకి పోయిందో.. అప్పటి నుంచి తెలంగాణ ధ్వంసం కావడం మొదలైంది. శతాబ్ధాల పాటు వర్ధిల్లిన అప్పటి హైదరాబాద్ ఇప్పుడు లేదు. కట్టడాలు లేవు. ఆంధ్రా నేతల చేతుల్లోని తెలంగాణ చీడపురుగు పట్టిన పంటలా తయారైంది. ఇక్కడి ల్యాండ్‌స్కేప్ దేశంలో ఓల్డ్ మైసూర్‌లో తప్ప ఎక్కడా లేదు. దక్కనీ ప్రాంతంలో విలక్షణమైన వాతావరణం ఉండేది. ప్రత్యేకంగా తెలంగాణలోని 9 జిల్లాల్లో అప్పటి వాతావరణం అద్భుతంగా ఉండేది. 1960 నుంచి హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి.
తెలంగాణ ప్రాంతం జీవన విధా నం ఇతివృత్తంగా సిని మాలు తీసే విషయాలు గురించి చెబుతూ.. భారత దేశంలోని భాషలు, సంసృ్కతులు విభిన్నమైనవి. ప్రత్యేకంగా దక్కనీ ప్రాంతం విలక్షణమైనది. మీరు భారత దేశ పటం ఆకారం చూసినట్లయితే, హైదరాబాద్ నగరం మ్యాప్‌లో మధ్యలో కడుపులా ఉంటుంది. ప్రతిదీ హైదరాబాద్‌లో కలవాల్సిందే. అక్కడ జీర్ణం కావాల్సిందే. హైదరాబాద్‌లో భిన్న భాషలు మాట్లాడే మనుషుల జీవన విధానం ఉంది. ఈ సంసృ్కతి భారత దేశంలో ఎక్కడా లేదు.
హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ.. అన్ని భాషలూ మాట్లాడుతారు. అందుకే ‘డిస్టింక్ట్ లింగ్వా ఆఫ్ ఫ్రాంకా’/దక్కనీ భాష అంటారు. అన్ని భాషల మిశ్రమమే దక్కనీ.ఉత్తరాది వారు మన హైదరాబాదీ భాషను హేళన చేసేవారు. అపన్, తుపన్ లాంటి పదాలు వింటే వాళ్లు నవ్వేవారు. కానీ ఇది ఓ ప్రత్యేకమైన విలక్షణమైన భాష. అలాంటి పదాలతో నిజాం కవి త్వాలే రాసేవారు. కులీకు త్బుషా దక్కనీ భాషలో అందమైన కవిత్వాలు రాసేవారు. ఆ కవిత్వాలను నా సినిమాలో వాడాను. ‘నిషాంత్’ సినిమా పాటలు వినండి.. అద్భుతమైన కులీకుతుబ్ షా కవిత్వం ఉంటుంది. అలాగే ‘మండి’ సినిమా పాటలు కూడా. నా దగ్గర ఇప్పటికే కులీకుతుబ్ షా కవిత్వాల కలెక్షన్ ఉంది. అది దక్కనీ భాష. ఉత్తరాది సినిమా వాళ్ల రాకతో అప్పటి అందమైన భాష కూడా ధ్వంసమైంది.
ఉత్తరాది సినిమావాళ్లు దక్కనీ భాషను ఎలా హేళన చేశారో, ఆంధ్రా సినిమా వాళ్లు తెలంగాణ భాషను అలా వెక్కిరించారు. నిజానికి మన అందరికీ తెలుసు. తెలంగాణ భాష అసలైన తెలుగు భాష. ఆంధ్రా సినిమా వాళ్లకు తెలంగాణ ప్రజల మీద చులకన భావన ఉండేది. చదువు రాదని, తెలివి లేని వాళ్లు అని, అందుకే సినిమాల్లో తెలంగాణ భాషను వెక్కిరించే డైలాగ్‌లు ఉండేవి. కానీ ఈ ప్రాంత ప్రజలు గ్రేస్‌ఫుల్ పీపుల్. వీళ్లకు మర్యాద తెలుసు. దక్కనీ ప్రాంతంలోని ఔరంగాబాద్, నాందేడ్, మరాఠ్వాడా, గుల్‌బర్గా ప్రాంతాల ప్రజలను పరిశీలించండి, కర్టెసీతో పాటు విలక్షణమైన మనస్తత్వం ఉన్న మనుషులుగా కనిపిస్తారు. కేరళ, తమిళనాడు లాంటి కోస్తా ప్రాంతాల్లో పంటలు పండినట్లు, తెలంగాణలో అంత సులువుగా పంటలు పండవు. పంటలు సులువుగా పండే ప్రాంతాల్లో ప్రజలు చాలా అగ్రెసివ్‌గా ఉంటారు.
నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ ఆధారంగా దూరదర్శన్ కోసం ‘భారత్ ఏక్ ఖోజ్’ అని తీశారు కదా, నెహ్రూ ప్రాపంచిక దృక్పథం వెనుకంజ వేసి ఇప్పుడు హిందుత్వ తీవ్రవాద దక్పథం పైచేయి అవుతున్నది కదా, దీనిపై మీరెలా స్పందిస్తారు అని అడిగితే..
‘భారత్ ఏక్ ఖోజ్’ లో రెండు దృష్టి కోణాలు ఉంటాయి. ఒకటి నెహ్రూ చూసిన భారత దేశం. రెండవది ఓంపురి పాత్రలో సామాన్య చరిత్రకారుడు చూసిన భారత దేశం. ఈ రెండు గొంతుకలు సమాంతరంగా ఈ సినిమాలో నడుస్తాయి. చరిత్ర మారదు. మన అవసరాలకు అనుగుణంగా చూసినప్పుడు చరిత్ర మారినట్లు అనిపిస్తున్నది.
ఇప్పుడు చరిత్రను కొంత మంది ఆరెస్సెఎస్ భావజాలంతో చూస్తున్నారు.
ఫైటింగ్, డాన్సుల తరహా కమర్షియల్ సినిమాలు కాకుండా రియలిస్టిక్ సినిమాలు తీయడానికి కారణం ఏమిటని అడిగితే.. అవి కత్రిమమైన సినిమాలు. మన జీవితానికి దూరంగా ఉండే అవాస్తవిక చిత్రాలు. నేను మీడియా కుటుంబం నుంచి వచ్చినవాడిని. మా నాయన ఫోటోగ్రాఫర్. ఆయనకో వీడియో కెమెరా ఉండేది. మేం పది మంది పిల్లలం. ఒక్కొక్కరి మీద తన కెమెరాతో ఒక్కొక్క సినిమాలా తీసేవారు. మా సినిమాలను మేం చూసుకునే వాళ్లం. సహజంగా ఉండేది. ఆ కెమెరాలతో నేను మా కుటుంబసభ్యులను చిత్రీకరించేవాన్ని. ఆ ప్రభావమే కుటుంబ విధానం, జీవితంలో బ్యూటీని క్యాప్చర్ చేసేలా చేసిందేమో.
దేశంలోని ‘అసహనం’ గురించి అడిగితే.. భారత దేశంలో రకరకాల కులాలు, మతాలు ఉన్నాయి. ఆ వైవిధ్యాన్ని మనం ఆమోదించాలి. హిందూ ముస్లిం అన్నది ఎప్పటికే పెద్ద సమస్యే. మా చిన్నప్పుడు ముస్లిం పిల్లల్ని, హిందూ కిచిన్‌లోకి రానిచ్చేవాళ్ళు కాదు. హిందూ పిల్లలు ముస్లింల ఇంటికి వెళ్లి వస్తే బయట కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లాలి. హిందూ ముస్లింలు కలిసి తింటే.. కంచాలు కూడా సపరేటుగా కడిగేవారు. ఎంగిలి కంచాలను కూడా కలవనిచ్చేవాళ్లు కాదు. నాన్‌సెన్స్, క్రేజీ. కానీ దేశంలోని అన్ని ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ చాలా నయం. మన మతస్తులను ట్రీట్ చేసినట్టు కాకుండా వేరే మతస్తులను తేడాగా ట్రీట్ చేస్తున్నాం. ఈ రకమైన ఇబ్బందికర సంబంధాలు ఉన్నా యి. దీన్ని పూర్తిగా అంతమొం దించాలి.
తెలంగాణ తెలుగు సినిమాల గురించి చెబుతూ … అప్పట్లో హైదరాబాద్‌లో తెలుగు సినిమా పరిశ్రమలేదు. మదరా సులో ఉండేది. తెలంగాణ రిప్ర జెంటేషన్ సినిమాలే లేవు. కేవలం ఆంధ్రా రిప్రజెంటేషన్ సినిమాలే వచ్చేవి. తెలంగాణ ఫిల్మ్ మేకర్స్ అరకొర తప్ప పెద్దగా ఉండేవారు కాదు. నేను ‘అంకుర్’ తీసినప్పుడు.. దక్కనీ భాషలో తీసిన మొదటి సినిమా. తమాషా ఏందంటే విజయవాడ నుంచి ఓ న్యూస్‌పేపర్ రివ్వ్యూలో ఏం రాశారంటే.. తెలంగాణలో తీసిన మొట్టమొదటి తెలుగు సినిమా అని. ఇప్పుడు తెలంగాణ చ్చాక..తెలంగాణ ఇతివృత్తంతో సినిమాలు వస్తున్నాయని విన్నాను. ఇది మంచి పరిణామం.చివరగా.. ఏం చెబుతారు?చిన్న భూగోళంలో విశ్వాన్ని దర్శించాలి. కెమెరా కంటితో ఓ సింగిల్ ఫ్రేమ్‌లో దాన్ని ఆవిష్కరించాలి.