Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Siddaramaiah: సిద్దరామయ్య పై సిద్ధం

–ముడా స్కాంపై ముమ్మరంగా ముందుకెళ్తున్న దర్యాప్తు సంస్థలు
–మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ
–లోకాయుక్త ఎఫ్‌ఐఆర్‌ అధ్యయ నంలో సీబీఐ

Siddaramaiah: ప్రజా దీవెన, బెంగళూరు: మైసూర్‌ (Mysore) నగరాభివృద్ధి సంస్థ(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామ య్యకు (Siddaramaiah) ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్య వహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్ట రేట్‌(ఈడీ) రంగంలోకి దిగాయి. మరోవైపు సిద్దరామయ్య భార్య పార్వతి తనకు కేటాయించిన 14 ప్లాట్లను సరెండర్‌ చేస్తున్నట్లు నెల రోజుల క్రితం ముడా కమిషనర్‌కు రాసిన లేఖ సోమవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై లోకా యుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమో దు చేశారు. ముఖ్యమంత్రి సిద్దరా మయ్య ఏ1గా, ఏ2, ఏ3లుగా ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, ఏ4గా భూ యజమాని దేవరాజు ఉన్నారు.

ఈడీ, సీబీఐ (ED, CBI)కూడారంగంలోకి దిగడంతో.. సిద్దరామయ్య ఇక ఏ క్షణంలోనైనా విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోకాయుక్త ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకొని ఈడీ అధికారులు ఈ అంశంపై సిద్దరామయ్య(Siddaramaiah), ఆయన భార్య పార్వతి తదితరులపై సోమవారం మనీ లాండరింగ్‌ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌)ను నమోదు చేశారు. దాని ప్రకారం ఈడీ సమన్లు జారీ చేసి, నిందితులను ప్రశ్నించనుంది. మరోవైపు లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ కూడా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. ఇలా అన్ని వైపుల నుంచి ముఖ్యమంత్రికి ఉచ్చు బిగుస్తోంది. వివిధ కార్యక్రమాల షెడ్యూల్‌ ఉన్నా.. ముఖ్యమంత్రి సోమవారం అధికారిక నివాసంలోనే గడిపారు. మరోవైపు, ముడా కమిషనర్‌కు సిద్దరామయ్య భార్య పార్వతి తన 14 ప్లాట్లను సరెండర్‌ చేస్తున్నట్లు నెలక్రితం ఓ లేఖ రాశారు. ఈ లేఖ తాజాగా వైరల్‌ (VIRAL) అవుతోంది. మైసూరు తాలూకా కేసరే గ్రామంలోని సర్వే నంబర్‌ 464లో 3 ఎకరాల 16 గుంటల భూసేకరణకు పరిహారంగా విజయనగర ఫేస్‌–3, 4లలో తనకు కేటాయించిన 14 ప్లాట్లను తిరిగి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తన భర్తపై 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేదని, ఆయనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.