— పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ లు
–ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలా పాల్గొంటారని సూటి ప్రశ్న
— ఒక సంఘానికి అనుకూలంగా వ్యవహరించడం నేరమంటున్న సంఘాలు
–ఎంఈఓ లు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
–ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు కై సిద్ధం
Teachers’ union : ప్రజాదీవెన నల్గొండ : ఒక ఉపాధ్యాయ సంఘానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న చింతపల్లి, మర్రిగూడ, (మండల విద్యాధికారులు) ఎంఈఓ విటి నగర్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. చింతపల్లి మండలంలోని వీటి నగర్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఒకవైపు 10వ తరగతి విద్యార్థులు స్టడీ అవర్ లో చదువుతున్న సమయంలో మండల పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులను పర్యవేక్షించే సిబ్బంది ఏ సంఘానికి అనుకూలంగా వ్యవహరించవద్దన్నది ప్రాథమిక అంశం. ఎంఈఓ లు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు ఒక సంఘానికి అనుకూలంగా వ్యవహరిస్తే మిగిలిన సంఘాల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత ఉండదన్నది ఉపాధ్యాయ సంఘాల ఆరోపణ. ఈ నిబంధనలను కాదని చింతపల్లి, మర్రిగూడ ఎంఈఓ లు, వీటి నగర్ స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పిఆర్టియు సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఎలా పాల్గొంటారని యుటిఎఫ్, పిఆర్టియు తెలంగాణ, టిపియుఎస్ ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నేతలతో చింతపల్లి మండలంలో విద్యావ్యవస్థ నాశనమవుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి బసవరాజు శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
విషయం తెలుసుకున్నా తర్వాత చర్యలు
బిక్షపతి (జిల్లా విద్యాశాఖ అధికారి నల్గొండ)
పిఆర్టియు సంఘం ప్రతినిధి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పాల్గొన్న విషయం నాకు తెలియదు. సమాచారం తెలుసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటాము.
అధికారులపై చర్యలు తీసుకోవాలి
అంకూరి నరసింహ (బిజెపి దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు)
చింతపల్లి మండలంలో పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం నేత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న చింతపల్లి, మర్రిగూడ ఎంఈఓ స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకూరి నరసింహ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఒక సంఘం నేత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు అనుమతిని ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ముగ్గురు అధికారులపై సోమవారం గ్రీవెన్స్ డే లో జిల్లా కలెక్టర్, డిఈఓ కు ఫిర్యాదు అందజేయనున్నట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక ఉపాధ్యాయ సంఘానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.