Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Venapalli Panduranga Rao: మృతదేహాలను కుటుంబాలకు ఇవ్వకపోవడం క్రూరత్వమే

–మానవీయ విలువలను మంటగల్పుతున్నారు

–శవాలను చూసి రాజ్యం వనికిపోతుంది

–అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి

–మట్టి మనిషి వేనపల్లి పాండురంగారావు

Venapalli Panduranga Rao: ప్రజాదీవెన నల్గొండ : చతిస్గడ్ రాష్ట్రంలో నారాయణపూర్ అడవులలో మే 21 న బూటకపు ఎన్కౌంటర్ లో మరణించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పజెప్పకపోవడం కేంద్ర, రాష్ట్ర (చతిస్గడ్) ప్రభుత్వాల క్రూరత్వానికి నిదర్శనమని ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. మృతదేహాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అమానవీయ ఘటనను నిరసిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ భవన్ లో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల బాధ్యులు మట్టి మనిషి వేనపల్లి పాండురంగారావు మాట్లాడుతూ రాజ్యం శవాలను చూసి కూడా వనికి పోతుందని, చనిపోయిన మృతదేహాలు కూడా పాలకులను భయపెడుతున్నాయంటే వారు ఎంత శక్తివంతులో ప్రజలు, సమాజం గమనించాలన్నారు.

గుజరాత్ లో ప్రారంభించిన నరమేదాన్ని దేశం మొత్తం వ్యాప్తి చేస్తున్నారని అంధోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నంబాల కేశవరావు, నాగేశ్వరరావు, విజయలక్ష్మి, రాకేష్, సంగీత మృతదేహాలను మాత్రమే ఇవ్వకపోవడానికి గల కారణాలేమిటో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ముందు ఉంచాలన్నారు. మృతదేహాల పట్ల రాజ్యానికి ఎందుకు ఇంత శత్రుత్వం అని ప్రశ్నించారు. శత్రువు చనిపోయినప్పటికీ కడసారి చూడాలని సాంప్రదాయాల్లో పేర్కొనబడిందని ఆ సాంప్రదాయ మర్యాదలను కూడా కేంద్ర ప్రభుత్వం గౌరవించకపోవడం శోచనీయమన్నారు. ఐదు రోజులుగా ఆయా మృతదేహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నా చతిస్గడ్ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గానీ ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఇంతటి అమానవీయ ప్రభుత్వాలను ప్రజలు ఎండగట్టాలన్నారు.

కనీసం శవాలను భద్రపరచకపోవడం ఏ సంస్కారానికి నిదర్శనం అని నిలదీశారు. మానవీయ విలువలను మానవతా దృక్పథాన్ని మనుషులను ప్రేమించడం అనే విలువలకు దయా, కరుణ, జాలి అని వాటిని ధ్వంసం చేయడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తుంది అన్నారు. సంస్కారాల్లో కెల్లా మృతదేహాలకు చేసే అంతిమ సంస్కారం గౌరవప్రదంగా ఉంటుందని తక్షణమే ఆ శవాలను బంధువులకు కుటుంబాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటు సామ్రాజ్యవాదం పెట్టుబడిదారుల కోసం రాజ్యం ఎంత స్థాయికైనా దిగజారుతుందనడానికి నారాయణపూర్ అమరవీరుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఇందుకు నిదర్శనం అన్నారు.

న్యాయస్థానం జోక్యం చేసుకొని శవాలను కుటుంబాలకు అప్పగించే విధంగా ఆదేశాలు జారీ చేయాలన్నారు. శవాల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న దుర్మార్గపు విధానాలను ప్రజలు, మేధావులు, బుద్ధి జీవులు, ప్రజాస్వామికవాదులందరు ఐక్యమై ప్రతిఘటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల బాధ్యులు సుధాకర్ రెడ్డి, పందుల సైదులు, రామయ్య, జానకిరామ్ రెడ్డి, పన్నాల గోపాల్ రెడ్డి, పాలడుగు నాగార్జున, కోమటిరెడ్డి అనంతరెడ్డి, తోట నరసింహచారి, మోతుకూరి శ్రీనివాస్, ఆర్.శ్రీనివాస్,యాదగిరి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.