–వారికి వత్తాసు పలుకుతున్న అధికారులు ఎవరు
–బాధ్యులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
–సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న కార్యదర్శులను వెంటనే బదిలీ చేయాలి
–నల్లగొండ పార్లమెంట్ కంటెస్టెండ్ అభ్యర్థి గోలి సైదులు
District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : విధులకు హాజరుకాకుండానే ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) యాప్ ద్వారా నల్లగొండ జిల్లాలోని 69 మంది పంచాయతీ కార్యదర్శులు ఇతర ఫోటోలు పెట్టి తప్పుడు అటెండెన్స్ నమోదు చేశారు. వారి పై జిల్లా అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నల్లగొండ పార్లమెంట్ కంటెస్టెండ్ అభ్యర్థి గోలి సైదులు ప్రశ్నించారు. వారికి వత్తాసు పలుకుతున్న అధికారులు ఎవరని నిలదీశారు. పంచాయతీ కార్యదర్శులు సక్రమంగా విధులను నిర్వర్తించకపోవడం వల్ల జిల్లాలోని అనేక గ్రామపంచాయతీలలో సరైన సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు అటెండెన్స్ నమోదు చేసిన పంచాయతీ కార్యదర్శులపై తక్షణమే శాఖపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు స్థాన చలనం కల్పించాలన్నారు. బదిలీ చేయని పక్షంలో ఎంతో కాలంగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల వల్ల ఆ గ్రామంలో స్థానిక ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఇదే విషయాన్ని రాబోవు రెండు, మూడు రోజుల్లో ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు.