–ఆట కట్టించిన నల్గొండ జిల్లా పోలీసులు
— ఐఏఎస్ అంటూ ఘరానా మోసం
–ఓ బాధితుడి పిర్యాదు తో కేసు నమోదు చేసిన పోలీసులు
–ఐఏఎస్ గా చలామణి అవుతున్న యువతి లావుడి తండాకు చెందిన సరిత గా గుర్తింపు
Woman Fraud : ప్రజాదీవెన నల్గొండ : తాను ఐఏఎస్ అంటూ యువకులకు బురిడీ కొట్టించి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన యువతి ఆట కట్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన సరిత అలియాస్ ప్రత్యూష హైదరాబాద్లోని హాస్టల్ లో ఉంటూ తాను డాక్టర్ నని, ఐఏఎస్ ర్యాంక్ వచ్చిందని త్వరలో పోస్టింగ్ వస్తుందని అమాయకులను బురిడీ కొట్టించి బుట్టలో వేసుకుంది. పలువురి యువకులను ట్రాప్ చేసి తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసింది.
ఏడాది క్రితం ఓ వైద్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ 5 లక్షలు వసూలు చేసింది.అంతే కాకుండా గత మూడు రోజుల క్రితం 100 కు కాల్ చేసి వనస్థలిపురం పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. డీఎస్పీ సతీమణి అంటూ ఖాకీలకు దమ్కీ ఇచ్చిన ఆరోపణలు ఉన్నాయి.గతంలో ఓ యువతి మర్డర్ అంటూ హైదరాబాద్ లోని ఓ డి.ఎస్.పి, మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని ఓ సీఐ కి కాల్ చేసి మొబైల్ స్విచ్ఛాఫ్ చేసింది. విద్యార్ధిని ముసుగులో హాస్టల్ లో ఉంటూ…అమ్మాయిల దగ్గర నగదు, మొబైల్స్ ఎత్తుకెళ్లింది. ఇటీవలే ఓ యువకుడిని వేధించడంతో పోలీసులను ఆశ్రయించాడు. వారు ఆమెను అరెస్టు చేసి విచారించగా పలు విషయాలు వెలుగులో వచ్చాయి. ఇప్పటికేసరితపై మలక్ పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ టూ టౌన్, మిర్యాలగూడ వన్ టౌన్ పీఎస్ లో పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి.
కాగా సోమవారం చోరీ కేసులో సరితను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నల్గొండ వన్ టౌన్ పీఎస్ లో నమోదైన కేసు పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.