–నేడు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం
— అమలు కాని చట్టాలు
— పట్టించుకోని అధికారులు
— చట్టాలను అమలు చేసి బాల్యానికి భరోసా కల్పించాలంటున్న ప్రజలు, మేధావులు, విద్యావంతులు
World Day Against Child Labour: పల్లెటూరి పిల్లగాడా పసుల గాసే మొనగాడా, పాలు మరచి ఎన్నాళ్ళయ్యిందో, ఓ పాల బుగ్గల జీతగాడా, కొలువుదీరి ఎన్నాళ్ళయ్యిందో’ అంటూ… ప్రజాకవి సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట భారతదేశంలో శతాబ్దాల తరబడి బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్న బాలల జీవన చిత్రాన్ని ప్రతిబింబిస్తుంది. బడిలో ఉండాల్సిన పిల్లలను, ఆట పాటలతో గడపాల్సిన బాల్యాన్ని బందీ చేయడం ఒక అనాగరిక చర్య. ఇది మన భారతదేశ సమస్య మాత్రమే కాదు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న చాలా దేశాల సమస్య కూడా నేడు ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘ప్రజాదీవెన’ ప్రత్యేక కథనం
ప్రజాదీవెన నల్గొండ బ్యూరో: బడిలో ఉండాల్సిన పిల్లలను, ఆటపాట లతో గడపాల్సిన బాల్యాన్ని బందీ చేయడం అనాగరిక చర్య. తల్లిదండ్రులు మరణించడం, కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత వంటి కారణాల వల్ల బాలలు కార్మికులుగా మారుతున్నారు. 14 సంవత్సరాల్లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్ట విరుద్ధమైన్పటికీ ఆర్థిక కారణాల వల్ల బాలలు పనుల్లో చేరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ప్రధాన పట్టణాలే కాకుండా నియోజకవర్గ ప్రధాన కేంద్రాలోని పట్టణాల రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, హోటల్స్, మోటారు మెకానిక్ షెడ్లు, పలు ఆపార్ట్మెంట్లలో పనులలో బాలలు కనిపిస్తున్నారు. పూర్వంతో పోల్చుకుంటే బాలికార్మికుల సంఖ్య తగ్గినా పూర్తిగా మార్పు రావడం లేదు. పారిశుధ్య కార్మికుల కాలనీలోని బాల బాలికలు పారిశుధ్య పనులకు వెళుతున్నారు. చెత్త సేకరిస్తున్నారు. బాల కార్మికుల వ్యవస్థను నిర్మించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా బాల కార్మికులను నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
—రక్షణ చట్టాలు ఇవే…
బాల కార్మికుల రక్షణకు
అనేక చట్టాలు రూపొందించారు. బాలకార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కరించేందుకు గురుపాదస్వామి కమిటీని
1979లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1986 బాల కార్మిక (నిషేధం, నియంత్రణ) చట్టం రూపొందించారు. 2009 విద్యా హక్కు చట్టం ద్వారా బాల బాలికలకు నిర్బంధ విద్య అందిస్తున్నారు. 2016 బాల కార్మికుల సవరణ చట్టం 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను పనిలో పెట్ట డాన్ని నిషేదించింది. 2017లో బాల కార్మికుల నిషేధ చట్టం సవరణలు చేశారు. ఇవే కాకుండా గనుల చట్టం-1952, ఫ్యాక్టరీల చట్టం – 1948, మర్చంట్ షిప్పింగ్ యార్డు – 1958, మోటారు ట్రాన్స్పోర్టు చట్టం – 1961, బీడీ, సిగర్ వర్కర్స్ చట్టం- 1966, బాండెడ్ లేబర్ సిస్టమ్ యాక్ట్ 1976, పేలుడు చట్టం- 1984ల ద్వారా బాలలను పనిలో పెట్టకూడదు.
–శిక్షలు ఇలా..
14 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్ల లను పనుల్లో పెట్టుకుంటే యజమానికి 6 నెలలు నుంచి 24 నెలల జైలు శిక్ష లేదా రూ.20 వేలు నుంచి రూ.50 వేలు జరిమానా విధిస్తారు. శిక్ష అనుభవించిన తర్వాత తిరిగి అదే తప్పు చేస్తే మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దాదాపు 20 వృత్తుల్లో బాలబాలికలు పనిచేయకూడదని నిబంధనలు ఉన్నాయి. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ వంటి కార్యక్రమాల ద్వారా బాలకార్మి కులను గుర్తించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే కాకుండా అసంఘటిత రంగ తయారీ యూనిట్లు, చైల్డ్ లేబర్ డిపార్ట్మెంటుతో కలిసి దాడులు చేసి బాలకార్మికులకు విముక్తి కల్పించాలి. కానీ అవేమీ జరగటం లేదు. బాల కార్మికుల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన చట్టాలు అమలు చేయడంలో సంబంధిత శాఖల అధికారులు విఫలమవుతున్నారు.బాల కార్మికుల నిర్మూలన కోసం ఏర్పాటైన చట్టాలను ఇప్పటికైనా సక్రమంగా అమలు చేసి బాల్యానికి భరోసా కల్పించాలని ప్రజలు, మేధావులు, విద్యావంతులు కోరుతున్నారు.