Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CP Sudheer Babu : ప్రారంభం కానున్న ఐపిఎల్ 2025 క్రికెట్ పోటీలు

–అభిమానులకు అసౌకర్యం కలగకుండా క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణ

— పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

–సీపీ సుధీర్ బాబు

CP Sudheer Babu : ప్రజాదీవెన హైదరాబాద్ : మార్చి 23 నుండి మే 21 వరకు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న 18వ ఎడిషన్ టాటా ఐపీఎల్ 2025 క్రికెట్ పోటీల నిర్వహణకు అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. భద్రత ఏర్పాట్లపై సిపి నేరేడ్ మెట్ లోని రాచకొండ కార్యాలయంలో డీసీపీలు, ఏసిపిలు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉప్పల్ స్టేడియం అధికారులు, సన్ రైజర్స్ టిమ్ ప్రతినిధులతో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మ్యాచ్ ల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భధ్రతాపరమైన ఉల్లంఘనలకు అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇచ్చే ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అగ్గిపెట్టెలు, పదునైన వస్తువులు, బయట నుంచి తెచ్చే తినుబండారాలు, వాటర్ బాటిల్స్ వంటి వాటిని స్టేడియంలోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని అధికారులను ఆదేశించారు.

భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, కార్లు, ద్విచక్ర వాహనాలకు విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ వాహనదారుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, ఉప్పల్ ప్రధాన రహదారి మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
స్టేడియం చుట్టూ దాదాపు 450 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు, వాటి ద్వారా స్టేడియం పరిసరాలను ఎలక్ట్రానిక్ నిఘా నీడలో ఉంచనున్నట్టు, ప్రతీ ఒక్కరి కదలికలూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతాయని పేర్కొన్నారు. సివిల్, ట్రాఫిక్, రిజర్వ్ పోలీసులు, ఎస్ఓటి వంటి పలు విభాగాల అధికారులు, సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారని తెలిపారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని ఐపీఎల్ నిర్వహణ బృందానికి సూచించారు. స్టేడియం ప్రవేశ మార్గాల్లో అనుమతి లేని వీధి వ్యాపారులను అనుమతించకూడదని, స్టేడియం లోపల ఆహార పదార్థాలను, శీతల పానీయాలను విక్రయించేవారు ఒకే రకమైన దుస్తులను ధరించాలని సూచించారు. ఈ సమావేశంలో మల్కాజ్ గిరి డిసిపి పద్మజ, క్రైమ్ డిసిపి అరవింద్ బాబు, డిసిపి అడ్మిన్ ఇందిర, డీసీపీ స్పెషల్ బ్రాంచ్ జి.నరసింహారెడ్డి, ట్రాఫిక్ డిసిపి మల్లారెడ్డి, డిసిపి ఎస్ఓటి రమణారెడ్డి, డిసిపి హెడ్ క్వార్టర్ శ్యాంసుందర్, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఐపిఎల్ ప్రతినిధులు ఇతర అధికారులు పాల్గొన్నారు.