Impressive Athletes in Asian Games: ఆసియా క్రీడల్లో ఆకట్టుకున్న అథ్లెట్లు
--100 పతకాల లక్ష్యాన్ని దాటిన భారత్ -- పారా అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
ఆసియా క్రీడల్లో ఆకట్టుకున్న అథ్లెట్లు
–100 పతకాల లక్ష్యాన్ని దాటిన భారత్
— పారా అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
ప్రజా దీవెన/ చైనా: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు చివరి రోజు అదరగొట్టారు. హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో చివరి రోజులో భారత పురుషుల 400 మీటర్ల T47 ఫైనల్‌లో దిలీప్ మహదు గావిట్ సత్తాచాటడంతో భారత్ మరో మైలురాయిని సాధించింది.
భారత్ పారా-అథ్లెట్లు 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలతో 111 పతకాలను సాధించారు. నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఆరు కాంస్య పతకాలతో చివరి రోజు భారత్ మొత్తం 12 పతకాలు సాధించింది. పురుషుల 400 మీటర్ల T47 ఈవెంట్‌లో గావిట్ 49.48 సెకన్లలో స్వర్ణ పతకాన్ని సాధించగా ఇందులో అతను ఇండోనేషియాకు చెందిన నూర్ ఫెర్రీ ప్రదానా, శ్రీలంకకు చెందిన మరవాకా సుబాసింగ్ వరుసగా రజతం, కాంస్యాలతో గెలుపొందాడు. ఆసియా పారా గేమ్స్‌లో భారత్ తొలిసారిగా 100 పతకాల మార్కును చేరుకుంది.
2018లో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్య పతకాలతో 72 పతకాలు సాధించింది. ఇదే భారత్ అత్తుత్తమ ప్రదర్శనగా పేర్కొంటున్నారు. పారా అథ్లెటిక్స్‌లో నీరజ్ యాదవ్ పురుషుల జావెలిన్ త్రో F55లో స్వర్ణం సాధించాడు. టేక్ చంద్ పురుషుల జావెలిన్ త్రో F55లో కాంస్యం కైవసం చేసుకోగా పూజ మహిళల 1500 మీటర్ల T20లో కాంస్యం గెలుచుకుంది.
పతకాలలో ఎక్కువగా చెస్‌లో 7 పతకాలు వచ్చాయి . ఇందులో రెండు స్వర్ణాలు, రజతం ,నాలుగు కాంస్యాలు ఉన్నాయి. ర్యాపిడ్ V1-B1 ఈవెంట్‌లలో పురుషుల, మహిళల జట్లు వరుసగా స్వర్ణం, కాంస్యం గెలుచుకున్నాయి. వ్యక్తిగత పతకాలు దర్పణ్ ఇనానికి పారా చెస్ B1లో స్వర్ణం దక్కింది.
సౌందర్య ప్రధాన్ కు పారా చెస్ B1లో రజతం వచ్చింది. అశ్విన్ మక్వానా కు పారా చెస్ B1లో కాంస్యం, కిషన్ గంగోలి పురుషుల పారా చెస్ B2లో కాంస్యం దక్కాయి. పీఆర్3 మిక్స్‌డ్ డబుల్ స్కల్స్‌లో అనిత, నారాయణ కొంగనపల్లె రెండో స్థానంలో నిలిచారు. రోయింగ్‌లో భారత్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
పారా అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం మన అథ్లెట్ల సంపూర్ణ ప్రతిభ, కృషి , దృఢ సంకల్పం ఫలితంగా సాధ్యమైందని పేర్కొన్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే యువతకు సాధ్యం కానిది ఏదీ లేదని మోదీ స్పష్టం చేశారు.