Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vinod Kambli: భారత క్రికెట్ లో ఆయనదొక ప్రత్యే క అధ్యాయం, ఆయనెవరో తెలుసా

ప్రజా దీవెన, హైదరాబాద్: భారత క్రికెట్‌లో వినోద్ కాంబ్లీది ఒక ప్రత్యేకమైన అధ్యాయం. మైదానం తోపాటు వెలుపల కూడా కాంబ్లీ ఆడంబరంగా కనిపించేవాడు. 1990లలో గోల్డ్ నెక్లెస్, బ్రాస్‌లెట్‌తో మైదానంలో కనిపించే కాంబ్లీ కెరియర్ ఆ తర్వాత అర్ధాంతరంగా ముగిసిపోయింది. కాంబ్లీ జీవితం దుర్భరంగా సాగుతున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చి సంచలనమైంది. అనారోగ్య కారణాలతోపాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కాంబ్లీని ఆదుకునేందుకు 1983 నాటి భారత జట్టు ముందుకొచ్చింది. కాంబ్లీకి సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం బీసీసీఐ నెలకు ఇచ్చే రూ. 30 వేల పెన్షన్‌తో జీవితాన్ని నెట్టుకొస్తున్న ఈ మాజీ ఆటగాడి నికర ఆస్తి ఒకప్పుడు దాదాపు రూ. 13 కోట్ల వరకు ఉండేది. రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో కాంబ్లీ మాట్లాడుతూ తాను బతికేందుకు అసైన్‌మెంట్స్ కావాలని చెప్పుకొచ్చాడు. యువ ఆటగాళ్లతో కలిసి పనిచేసే సత్తా తనకు ఉందన్నాడు. ముంబై జట్టుకు ప్రస్తుతం అమోల్ (ముజుందార్) హెడ్ కోచ్‌గా ఉన్నాడని, తనకు కూడా అతడితో కలిసి పనిచేసే అవకాశం ఇస్తే బాగుంటుందని, ఎక్కడైనా సరే పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

2022లో ఈ ఇంటర్వ్యూ వైరల్ అయిన తర్వాత మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త సందీప్ తోరట్ కాంబ్లీకి నెలకు రూ. లక్ష వేతనంతో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ముంబైలోని తన సహ్యాద్రి ఇండ్రస్ట్రీ గ్రూప్‌లో ఫైనాన్స్ డివిజన్‌లో జాబ్ ఇచ్చేందుకు తోరట్ ముందుకొచ్చారు. అయితే, ఆ ఉద్యోగంతో క్రికెట్‌కు ఎలాంటి సంబంధమూ లేకపోడంతో ఆ ఆఫర్‌ను కాంబ్లీ తిరస్కరించాడు.