Sunita Williams: ప్రజా దీవెన, వాషింగ్టన్ : భారత సంతతి వ్యోమగామి (Indian-origin astronaut) సునీతా విలియమ్స్ (Sunita Williams) భూమిపైకి తిరిగి వచ్చేందుకు మరో ఆరు నెలలు పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నాసా (NASA) కీలక ప్రకటన కూడా చేసింది. సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బారీ విల్‌మోర్‌ను ఫిబ్రవరిలో తీసుకువస్తామని, అప్పటివరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే వీరు ఉంటారని నాసా ప్రకటించింది.
వీరు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక (Boeing Starliner Spaceship)లో సాంకేతిక సమస్యలు వచ్చినందున, దీంట్లో తిరుగు ప్రయాణం ప్రమాదకరమని నాసా నిర్ధారించింది.ఈ నేపథ్యంలో వ్యోమగాములు లేకుండా ఆటో పైలట్ పద్ధతిలో దీనిని తిరిగి భూమి మీదకు తీసుకురావాలని నిర్ణయించింది.
కాగా, ఎనిమిది రోజులు మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్ జూన్ 5న బయలుదేరిన విషయం తెలిసిందే. వీరు వెళ్లేటప్పుడే వ్యోమనౌకలో హీలియం లీక్ కావడంతో ప్రోపల్షన్ వ్యవస్థలో లోపాలు, వాల్వ్‌లో సమస్యలు వచ్చాయి. ఎలాగోలా జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకున్నారు. అయితే బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు రావడంతో తిరుగు ప్రయాణానికి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో నాసా చేసిన ప్రకటన సారాంశం మేరకు వారిద్దరు రావడానికి మరో ఆరు మాసాలు (6 months) సమయం పట్టనుంది.