Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

నాలుగు వందల మంది కి జైలు శిక్ష

--జూన్‌లో 2818 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు --44 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లను సస్పెండ్‌

నాలుగు వందల మంది కి జైలు శిక్ష

జూన్‌లో 2818 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు
–44 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లను సస్పెండ్‌

ప్రజా దీవెన/హైదరాబాద్: హైదరబాద్ సిటీ ట్రాఫిక్‌ పోలీసులు జూన్‌లో 2818 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌(డీడీ) కేసులు నమోదు చేశారని ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. ఇందులో న్యాయస్థానం 400 మందికి(ఒక రోజు నుంచి 7 రోజుల వరకు) జైలు శిక్ష, జరిమానాలు, మిగతా వారికి జరిమానాలు విధించిందని, 44 డ్రైవింగ్‌ లైసెన్స్‌లను సస్పెండ్‌ చేసిందని వివరించారు.

ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వివిధ ఉల్లంఘనలకు సంబంధించి 4321 ఛార్జీషీట్లు గత నెలలో కోర్టుకు సమర్పించగా ఇందులో మైనర్‌ డ్రైవింగ్‌కు పాల్పడ్డ వారిపై నమోదు చేసిన కేసుల్లో 195 మందికి న్యాయస్థానం సోషల్‌ సర్వీస్‌, కమ్యూనిటీ సర్వీస్‌ చేయాలని శిక్షలు విధించిందని వివరించారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారికి, నంబర్‌ ప్లేట్‌ లేని వారు, అర్హత లేని వారు, నిబంధనలను పాటించని వాహన యజమానులకు ఆయా ఉల్లంఘనలపై న్యాయస్థానం జరిమానాలు విధించిందన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ఇతర ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారికి న్యాయస్థానం శిక్షలు విధించడం వల్ల అది భవిష్యత్తుపై మరకలా ఉంటుందని, ప్రభుత్వ ఉద్యోగాలు, పాస్‌పోర్టు, వీసాలు రావడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అదనపు సీపీ సూచించారు.