Banana Benefits: సాధారణంగా అరటి పండులో తీపితో పాటు అనేక పోషకాలు ఉంటాయి. అరటి పండు మనకి దాదాపు అన్ని కాలాలలో దొరుకుతుంది. ఈ పండు పోషకాల నిధి.. దీనిని ప్రజలు తరచుగా అల్పాహారంలో తీసుకుంటారు. చాలా మందికి అరటిపండు అంటే ఇష్టముంటుంది. అయితే కొందరికి మాత్రం అసలు నచ్చదు. చాల మంది అరటి పండు తినడం వల్ల పొట్టలో కొవ్వును పెంచుతుందని నమ్ముతారు. అంతేకాకుండా.. పొత్తి కడుపు ఊబకాయం పెరుగుతుందనే అపోహ కూడా ఉంది. అరటిపండు తింటే స్థూలకాయం వస్తుందన్న ప్రజల అభిప్రాయం పూర్తిగా తప్పని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటిపండు ఒక బహుముఖ పండు.. పరిమిత పరిమాణంలో తీసుకుంటే, అది బరువు (weight loss) తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.
మీరు అనవసరమైన స్నాక్స్, కుకీలను (Snacks, cookies)నివారించి.. అరటిపండును తీసుకుంటే బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి జిమ్‌కి వెళితే, వ్యాయామానికి ముందు అరటిపండు తింటే సరి. అరటిపండులోని సహజ చక్కెర వర్కవుట్‌కు ముందు శరీరంపై ఔషధంలా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల మనకి కూడా శక్తి పుష్కలంగా లభిస్తుంది. అరటి పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ B-6, అమైనో ఆమ్లం కూడా లభిస్తుంది. రోజూ ఒకటి నుండి రెండు అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అరటిపండు తినడం వల్ల జరిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఇప్పడూ చూద్దాం..
1. అరటిపండులో ఉండే విటమిన్ బి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. అరటి పండు తినడం ద్వారా నాడీ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. అలాగే అరటిపండు తీసుకోవడం వల్ల జీవక్రియలు పెరిగి ఊబకాయం తగ్గుతుంది.
2. అరటిపండులో లభించే ల్యూటిన్ కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని దూరం చేస్తుంది. అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. రోజూ 1-2 అరటిపండ్లు తీసుకోవడం వల్ల మీ శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
3. మహిళలకు అరటిపండు ఒక సూపర్ ఫ్రూట్ అనే చెప్పాలి. పీరియడ్స్ రాకముందే స్త్రీల శరీరంలో అనేక రకాల శారీరక, ప్రవర్తనా మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో అరటిపండు తింటే ఈ మార్పులు కాస్త అదుపులో ఉంటాయి అని డాక్టర్లు అంటున్నారు.
4. వాస్తవానికి అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటుంది . ఇది శరీరంలో శక్తిని పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని బలహీనత, అలసట లాంటి సమస్యలు రావు..