Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: ఏడాదిలో సామజిక మార్పు సాధించాం

CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాష్ట్రంలో సామాజిక మార్పును తీసుకొచ్చామని, ఆర్థికపరమైన మార్పులు తీసుకురావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమని అన్నారు. ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, వారికి నష్టం కలిగించే పనులు ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2025 డైరీ, క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఉద్దేశించి మాట్లాడారు.

గత పదేళ్లలో పరిపాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారు. మేం అధికారంలోకి రాగానే పరిపాలన వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నం చేశాం. తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల మొదటి తారీఖు జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం కష్టకాలంలో బాధ్యతలు చేపట్టింది. ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్ని సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వంలో కనీస అవసరాలకు ప్రతీ నెల రూ. 22,500 కోట్లు అవసరం ఉండగా, రూ. 18,500 కోట్లు మాత్రమే ఆదాయం వస్తోంది. ఇంకా రూ. 4,000 కోట్ల లోటు ఉంటోంది. వచ్చే ఆదాయంలో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నాం. మరో రూ. 6,500 కోట్లు ప్రతి నెల అప్పులు చెల్లిస్తుండగా, మిగిలిన రూ. 5,500 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.

నిజానికి ప్రభుత్వం అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే నెలకు రూ. 30 వేల కోట్లు అవసరం ఉంటుంది. ఈ ప్రభుత్వం మనందరిది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉద్యోగుల సహకారం కావాలి. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి ధర్నాలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని ఒక కార్యాచరణ ప్రకారం ప్రభుత్వం పరిష్కరిస్తుంది. కొందరు రాజకీయాల కోసం నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని, అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.

సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం కింద పనిచేస్తోంది. అందులో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధం చేసే అవకాశం లేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉన్నా ప్రభుత్వానికి చేయలేని పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , నాయిని రాజేందర్ తో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.