Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Department of Education: రెండు విభాగాలుగా సైన్స్ పరీక్షలు

టెన్త్ విద్యార్థులకు వేర్వేరు ప్రశ్నాపత్రాలు

Department of Education: ప్రజాదీవెన, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి తొమ్మిది, పదో తరగతి సైన్స్‌ సబ్జెక్ట్‌ పరీక్ష విధానాన్ని పాఠశాల విద్యాశాఖ (Department of Education) మార్చింది. సైన్స్‌లోని భౌతిక, జీవశాస్త్రాల పరీక్షలు వేర్వేరుగా 2 రోజులు జరగనున్నాయి. ఇప్పటివరకు రెండింటికి కలిపి వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇస్తున్నప్సటికీ.. రెండు పేపర్లకు ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి భౌతికశాస్త్రం (Physics)పరీక్ష ఒక రోజు, జీవశాస్త్రం పరీక్ష మరుసటి రోజు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 4న జీవో కూడా జారీ చేసింది.

పరీక్షల్లో సంస్కరణల నేపథ్యంలో 2022 డిసెంబరులో పరీక్ష ప్రశ్నపత్రంలో (Exam question paper)ఛాయిస్‌ను మార్చిన సంగతి తెలిసింది. ఇది 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు మాత్రమే వర్తిస్తుందని నాటి జీవోలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరం ప్రశ్నపత్రాల స్వరూపంపై విద్యార్ధులు, ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. దీనిపై విద్యాశాఖ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని గత కొద్ది రోజులుగా చర్చసాగుతోంది. ఈ నేపథ్యంలో గత జీవోకు సవరణ చేస్తూ జీవో 23ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తాజాగా జారీ చేశారు.

భౌతిక, జీవశాస్త్రాల పరీక్షలు ఎలా ఉంటాయంటే..
2024 మర్చి పదో తరగతి పరీక్షల వరకు భౌతికశాస్త్రం, జీవశాస్త్రం (Physics, Biology)పరీక్షలు ఒకదాని తర్వాత మరొకటిగా ఒకే రోజు జరుపుతూ వచ్చారు. ఒకో పరీక్షకు గంటర్నర సమయం కేటాయించేవారు. ఒక పరీక్ష రాసిన తర్వాత జవాబుపత్రాలను తీసుకోవడం, అనంతరం మరో పరీక్ష ప్రశ్నపత్రం ఇవ్వడానికి అదనంగా 20 నిమిషాలు సమయం ఇచ్చేవారు. తాజాగా వెలువడిన జీవోతో వేర్వేరు రోజుల్లో పరీక్షలు జరపాలని నిర్ణయించడంతో ఒక్కో పరీక్షకు గంటన్నర సమయం మాత్రమే ఇవ్వనున్నారు. మిగిలిన సబ్జెక్టులన్నింటికీ ఒకటే పేపర్‌ ఉండటంతో ఒక్కో సబ్జెక్ట్‌ పరీక్షకు 3 గంటల సమయం కేటాయిస్తారు. ఇక ఛాయిస్‌ కూడా గతంలో మాదిరిగానే ఉంటుందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. సైన్స్‌ సబ్జెక్టులో మారిన విధానం తొమ్మిదో తరగతి పరీక్షలకు కూడా వర్తిస్తుందని సందర్భంగా వివరించారు.