నేనే కారు డ్రైవ్ చేస్తా నా పక్కన కూర్చో
మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్ వెళ్లడానికి రెడీ
సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసిన హరీశ్‌రావు
పేదల ఇండ్లను కూల్చడానికి మేము వ్యతిరేకం
తెలంగాణ భవన్‌లో మీడియా మీట్
Harish Rao: ప్రజాదీవెన, హైదరాబాద్: మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ (Mallannasagar and Ranganayaka Sagar) నిర్మాణ సమయంలో అక్కడి ప్రజలను బలవంతంగా తరలించామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఖండించారు. మూసీ నుంచి మల్లన్నసాగర్, రంగనాయక సాగర్‌కు వెళ్దామని శుక్రవారం సవాల్ విసిరారు. స్వయంగా తానే కారు డ్రైవింగ్ చేస్తా, తన పక్కన కూర్చో, ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రేపు ఉదయం తొమ్మిది గంటలకు సిద్ధం..
రేపు (శనివారం) ఉదయం 9 గంటలకు తాను సిద్ధంగా ఉంటానని హరీశ్‌రావు చెప్పారు. ముందు మూసీ బాధితుల దగ్గరకు వెళ్దామని, ఆ తర్వాత మల్లన్న సాగర్‌కు (Mallanna Sagar) వెళ్దామన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దామన్నారు. 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్న సాగర్ ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం స్థాయిని దిగజార్చారని చెప్పారు.
కేసీఆర్ హయాంలోనే..
కేసీఆర్ హయాంలో మూసీలోకి గోదావరి నీళ్లు తెచ్చేందుకు డీపీఆర్ (DPR) కూడా సిద్ధమైందని హరీశ్‌రావు అన్నారు. మూసీలోకి వ్యర్థాలను తరలించే పరిశ్రమలను ఫార్మా సిటీకి తరలించాలనుకున్నాం అన్నారు. మూసీలోకి వస్తున్న వ్యర్థాలను ఆపాల్సిన అవసరం ఉందని చెప్పారు. మూసీ పునరుజ్జీవం అంటే నదీ జలాల శుభ్రంతో ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. మూసీ పునరుజ్జీవం అని చెబుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. పేదల ఇళ్లు (Poor houses)కూలగొట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రివర్ ఫ్రంట్ ఏంటి, దాని వెనుక ఉన్న స్టంట్ ఏంటని ప్రశ్నించారు. మూసీపై సీఎం రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు.