Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kancharla Chandrasekhar Reddy: అల్లు అర్జున్ వ్యవహారంలో కొత్త మలుపు, దీపాదాస్‌ మున్షీను కలిసిన బన్నీ మామ

ప్రజా దీవెన, హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్‌ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఇవాళ(సోమవారం) కలిశారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గాంధీభవన్‌లో తమ ప్రెస్‌మీట్‌ జరుగుతుండగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడకు వచ్చారని తెలిపారు.

ఆయన బయటకు వెళ్లిపోయాక తనతో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. మళ్లీ వచ్చి తనను కలుస్తానని చెప్పారని మహేష్ కుమార్ గౌడ్‌ అన్నారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తన పాత మిత్రుడు, కాంగ్రెస్ వాది అని తెలిపారు. చంద్ర శేఖర్ రెడ్డితో తప్పకుండా మాట్లాడుతానని.. ఏదైనా విషయాలు ఉంటే చర్చించుకుంటామని మహేష్ కుమార్ గౌడ్‌ అన్నారు.సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిందని, ఆమె కుమారుడు ఆస్పత్రిలో ఉన్నారని తెలిపారు. ఈఘటన తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో A11గా ఉన్న అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఈ విషయంపై రాజకీయ లబ్ధి పొందేందుకు తెలుగు చిత్రసీమ చర్రిత తెలియనివాళ్లు మాట్లాడుతున్నారని అన్నారు.

బాధ్యత గల పదవిలో ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఆయనకు తెలవదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కూడా అడ్డగోలుగా ఈ విషయంపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలుగు చిత్రసీమకు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం వీళ్లకు తెలుసా అని ప్రశ్నించారు. తెలుగు చిత్రసీమ హైదరాబాద్ ఎలా వచ్చిందో వీళ్లకు తెలుసా అని నిలదీశారు. పుష్ప- 2కు కూడా వెసులుబాటు ఇచ్చింది తమ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. రాజకీయ నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని మహేష్ కుమార్ గౌడ్ హితవు పలికారు.