*స్వయంగా తానే నడుపుకుంటూ అసెంబ్లీకి వచ్చిన కేటీఆర్.*.
ప్రజా దీవెన* హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాల్గోరోజు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలు నడుపుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆటోలో ఎక్కించుకుని నడుపుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పద్మారావుగౌడ్, కృష్ణారావులు ఖాకీ చొక్కాలు ధరించి, ఆటోలు నడుపుకుంటూ అసెంబ్లీకి వచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉండాలని అన్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణం అవుతుందని, 93 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం అని అన్నారు. ఆటో కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దు.. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని కేటీఆర్ అన్నారు. అనంతరం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
మరోవైపు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, వారికి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వం ముందుచూపు లేని విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ తమ వాయిదా తీర్మానంలో పేర్కొంది.