Merger Day: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ జన సమితి కార్యాల యంలో (Jana Samiti office) సెప్టెంబర్ 17- తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వారి త్యాగాలను స్మరిస్తు, వారి పోరాటం తెలంగాణ సాధనకు ఎలా దారితీసిందో వివరిస్తూ మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండ రామ్ మాట్లాడుతూ “సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఒక కీలకమైన రోజు, ఈ రోజును ప్రజల పోరాట ఫలితంగా సాధించిన విజయంగా గుర్తించాలని” అన్నారు.
1989లో తెలంగాణ చరిత్రపై అవగాహన పెంచేందుకు ‘మా తెలంగాణ’ (‘Our Telangana’)అనే పత్రిక ఆవిష్కరణతో మొదలైన చర్చ.. తెలంగాణా రాష్ట్రం విలీనానికి సంబంధించిన చరిత్రపై ప్రజల్లో అవగాహన పెంచింది. అప్పటి నుండి సెప్టెంబర్ 17ను చర్చలోకి తెచ్చి, తెలంగాణా ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిపింది. ఈ రోజు, ఈ చర్చను మతకోణంలో చూడటం సరికాదు. సెప్టెంబర్ 17 వాస్తవానికి ప్రజాస్వామ్యం కోసం, ఫ్యూడల్ పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటం విజయో త్సవం అని ప్రస్తావించారు.సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకోవడం అంటే ఆనాటి స్పూర్తితో ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణ కోసం కృషి చేయడం. నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజల పోరాటం విజయవంతం కావడంలో పోలీస్ చర్య ఓ తుదిఘట్టం మాత్రమే. ఆ దిశగా జరిగిన ప్రజా ఉద్యమాల ప్రభావాన్ని మనం మరచిపోవద్దు. సెప్టెంబర్ 17ను జరుపుకోవడం అనేది ప్రజాస్వామ్య పరిరక్షణ (Preservation of democracy)కోసం ప్రజలు చేసిన పోరాటం స్ఫూర్తిని కొనసాగించడం తప్ప మరేమీ కాదు,” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి ప్రధాన కార్యదర్శులు బైరి రమేష్, పల్లె వినయ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి బట్టల రాంచందర్, రవికాంత్, జస్వంత్, రాష్ట్ర నాయకులు మారం లక్ష్మా రెడ్డి, తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.