Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS MLCKavitha: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్య, రైతు వ్యతిరేకి సీఎం రేవంత్ రెడ్డి

–బేషరతుగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలి
–దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభు త్వాన్ని అడుక్కోవాలా
–స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
–బోధన్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

BRS MLCKavitha ప్రజా దీవెన, హైదరాబాద్ : రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకం అమలుకు నిబంధనలను పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రైతులకు షరతులు విధించడమేంటని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అని నిలదీశారు.

ఎటువంటి నిబంధనలను విధించకుండా బేషతరుగా రైతులందరికీ రైతు భరోసా నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం తన నివాసంలో జరిగిన బోధన్ నియోజకవర్గ నాయకులు, కార్యక ర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రైతు భరోసా పథ కానికి కూడా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణ యించడం దారుణమని అన్నారు. ఇప్పటికే ప్రజా పాలన దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత… ఇంకెన్ని దరఖాస్తులు తీసుకుంటారని ప్రశ్నించారు. రైతులను వ్యవసాయం చేసుకోనిస్తారా లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ తిప్పలు పెడుతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

కేసీఆర్ రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారని, కానీ ఈ కాంగ్రెస్ నాయకులు రైతాంగాన్ని కుదేలు చేస్తున్నారని అన్నారు. రైతు భరోసాకు షరతులు, నిబంధనలు పెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని ఎండగట్టారు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని అన్నారు.

కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఏర్పడిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని తెలిపారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని, దాంతో ప్రజలు ఆ పార్టీ నాయకులపై గుర్రుగా ఉన్నారని తెలిపారు. మహిళలకు నెలకు రూ 2500 ఇస్తామని, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని, కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి… ఇప్పడు రైతు భరోసాకు షరతులు విధించే ప్రయత్నిస్తూ దగా చేస్తున్నారని చెప్పారు. హామీల అమలుపై ప్రతీ ఒక్కరు గళమెత్తాల్సిన అవసరం ఉందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. ముఖ్యంగా గతంలో కేసీఆర్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల వల్ల కలిగిన ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వివరించారు. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా నడవాలని సూచించారు. కేసీఆర్, తాము అండగా ఉంటామని, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని అన్నారు.

ఈ సమావేశంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.