Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

New Year celebrations: కొత్త సంవత్సరంకు సడన్ బ్రేక్ లు… పోలీసుల ఆంక్షలు

ప్రజాదీవెన, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో వేడుకలు నిర్వహించే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై పోలీసులు మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించే వారు 15 రోజుల ముందే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశించారు. మూడు నక్షత్రాలు, అంతకుమించిన స్థాయి హోటళ్లు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు వేడుకల నిర్వహకులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

మొత్తం నిర్వాహకులదే బాధ్యత..
నూతన సంవత్సర వేడుకలు నిర్వహించేందుకు అనుమతులు తీసుకోవడంతో పాటు పోలీసు ఉన్నతాధికారులు సూచించిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు తెలిపారు. వేడుకల్లో మత్తు పదార్థాలకు అనుమతించినా, అడ్డుకోలేకపోయినా దానికి కారణమైన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పార్కింగ్, ఇతర ప్రాంతాల్లో మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారేమోనని గమనించాలని పేర్కొన్నారు. నిర్ణీత సమయాల తర్వాత మద్యం అందించకూడదని, మద్యం మత్తులో ఇళ్లకు తిరిగి వెళ్లే వారికి క్యాబ్‌ లేదా డ్రైవర్లను సమకూర్చాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. బాణాసంచా కాల్చడానికి అనుమతి లేదన్నారు.

ప్రత్యేక సిబ్బంది నియమించుకోవాలి
నిర్వాహకులు కచ్చితంగా రాకపోకలు సాగించే పాయింట్లు, పార్కింగ్‌ దగ్గర రికార్డింగ్‌ సదుపాయం ఉండే సీసీ కెమెరాలు విధిగా ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. ట్రాఫిక్‌ నిర్వహణ, ఇతర భద్రత కోసం నిర్వాహకులు ప్రత్యేక సిబ్బంది నియమించుకోవాలని, ప్రదర్శనల్లో అశ్లీలత ఉండకుండా చూసుకోవాలని పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్, డీజే శబ్ధాలకు రాత్రి 10 గంటల వరకే అనుమతి ఉంటుందని, ఇన్‌డోర్‌లో ఒంటి గంట వరకే అనుమతి ఉంటుందన్నారు.

ఆయుధాలకు అనుమతి లేదు..
న్యూ ఇయర్​ వేడుకల్లో ఆయుధాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ముందస్తుగా నిర్ణయించిన సామర్థ్యానికి మించి వినియోగదారుల్ని అనుమతించవద్దని, వేడుకల్లో మైనర్లకు ప్రవేశం నిషేధమన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తే జరిగే అనర్థాలపై వేడుకల నిర్వాహకులు కచ్చితంగా ఓ సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులు విడుదల చేసిన మార్గదర్శకాల్లో తెలిపారు. పోలీసులు సూచించిన నిబంధనలు, మార్గదర్శకాలను నిర్వాహకులు పాటించని పక్షంలో వేడుకలను అనుమతించమని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు.