Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMRevanthReddy : తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మా నం, మన్మోహన్ కు భారతరత్న ప్రకటించాలి

CMRevanthReddy ప్రజా దీవెన, హైదరాబాద్ : భారతదేశాన్ని ప్రపంచంలో మేటిగా నిలబెట్టేందుకు కృషి చేసిన దార్శని కుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ కి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రధానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, సభా నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమో దించింది. అలాగే, తెలంగాణ ప్రజల 60 ఏండ్ల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప నాయకుడిగా, భావి తరాలు స్మరించుకునేలా డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సభ ఆమోదించింది. మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక వేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేస్తూ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. దేశ పురోగతికి డాక్టర్ మన్మోహన్ సింగ్ అందించిన సేవలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పురుడుపోసి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే గొప్ప నాయకుడిగా వారి కృషిని స్మరిస్తూ ముఖ్యమంత్రి గారు తీర్మానం ప్రవేశపెట్టారు. శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి తీర్మానం…

“భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఈ శాసనసభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశానికి విశిష్టమైన సేవలను అందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, భారత రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్‌పర్సన్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా వివిధ హోదాలలో వారు ఈ దేశానికి ఎన్నో సేవలను అందించారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. 1991 మరియు 1996 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దశ దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేయగలిగారు. 2004 మరియు 2014 మధ్య భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తన పదవీకాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారు వేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్నాం.

ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్త. వారిని కోల్పోవడం దేశానికి తీరని లోటు. ప్రజలకు ఉపాధి కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, పరిపాలనలో పారదర్శకతను చాటి చెప్పే సమాచార హక్కు చట్టం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యతను ఇచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించారు. ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు లాంటి సామాజిక విప్లవాత్మక కార్యక్రమాలను వారి హయాంలోనే మొదలయ్యాయి. ఉపాధి హామీ పథకంతో ఏడాదికి కనీసం వంద రోజుల పని కల్పించడం ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించవచ్చన్న గొప్ప లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అనంతపూర్‌లో, తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో ఆ కార్యక్రమాన్ని దేశానికి అంకితం చేయడం జరిగింది.

భూ సేకరణ సందర్భాల్లో నిరాశ్రయులవుతున్న వారికి అండగా నిలవాలని, వారికి నష్టం జరక్కుండా ఉండాలని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 2013 భూసేకరణ చట్టంలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలు, గిరిజనులను ఆదుకోవడానికి 2006 లో అటవీ హక్కుల చట్టాన్ని సవరించడంతతో ఆదివాసీల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. ఎన్నో ఏండ్ల పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

మన్మోహన్ సింగ్ గారు దేశానికి ముఖ్యంగా తెలంగాణకు చేసిన సేవలకు ఈ సభ అపారమైన కృతజ్ఞతలను తెలియజేస్తుంది. మన్మోహన్ సింగ్ తెలంగాణకు ఆత్మబంధువు. 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన నాయకుడు. తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియాగాంధీ ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చే బాధ్యతతో ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన గొప్ప మానవతావాది. తెలంగాణతో ఆయన అనుబంధం విడదీయలేనిది. రాష్ట్రం ఉన్నంత వరకు మర్చిపోలేనిది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో… రాజ్యసభలో ఒక దశలో రాజ్యాంగ సవరణల కోసం వచ్చిన చర్చలు తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందేమో అన్నంత గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో మన్మోహన్ సింగ్ గారికి అత్యంత సన్నిహితుడిగా అత్యంత నమ్మకమైన సహచరుడుగా జైపాల్ రెడ్డి గారితో మాట్లాడి వ్యూహాత్మక చతురతతో సమన్వయ పరిచి ఆ సవరణలకు ప్రధానమంత్రి వెళ్లి రాజ్యసభలో ప్రకటన ఇప్పించిన సందర్భం మనం ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం.

ఈ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్‌గా మన్మోహన్ సింగ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. అటువంటి మహనీయుడికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈ శాసనసభ ద్వారా రాజకీయాలు పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాక ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ శాసనసభ ఒకరోజు ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా వారికి భారతరత్న ఇవ్వాలని ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మేటి దేశంగా నిలబెట్టేందుకు వారు చూపిన దార్శనికత ఆయన చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలి, భావితరాలు స్మరించుకోవాలి.

డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రధానం ప్రధానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. తెలంగాణ ఏర్పాటుకు విడదీయలేని అనుబంధం ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనం వారి వర్ధంతులు, జయంతులు, వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఒక మంచి ప్రాంతంలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సముచితమైన నిర్ణయం”.ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై సమగ్ర చర్చ అనంతరం శాసనసభ దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.