Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TSRTC: అవకాశాలు అందుకుంటున్న ఆర్టీసీ

–పండుగ వేళ మహాలక్ష్మి లకు బంపర్ ఆఫర్
–రాఖీలు స్వీట్స్ బట్వాడ కోసం బస్టాండ్లలో కౌంటర్లు ఏర్పాటు
–బుక్ చేసిన 24 గంటల్లోనే అనుకున్న చోటికి డెలివరీ

TSRTC: ప్రజాదీవెన, హైదరాబాద్: ప్రైవేట్‌ మార్కెట్‌కు (Private market) ధీటుగా లాజిస్టిక్స్‌ విభాగాన్ని బలోపేతం చేసిన ఆర్టీసీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఈనెల 19వ తేదీన రక్షాబంధన్ (Rakshabandhan)సందర్భంగా స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని యువతులకు, మహిళలకు ఆర్టీసీ లాజిస్టిక్ అందుబాటులో ఉంటుందని సంస్థ హామీ ఇస్తుంది. రక్షాబంధన్ సందర్బంగా రాఖీలు, స్వీట్లు బట్వాడ కోసం ప్రధాన బస్టాండ్లలో అదనంగా 100 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని యాజమాన్యం ప్రకటించింది.

బుక్ చేసిన కౌంటర్ నుంచి 24 గంటల్లో వాటిని డెలివరీ చేస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 490కి పైగా బుకింగ్ కౌంటర్లను (Booking counters), 9,000లకు పైగా పార్శిల్ రవాణా వాహనాలను, 190కి పైగా నాలుగు టన్నుల నుంచి 10 టన్నుల కార్గో వాహనాలను ఆర్టీసీ కలిగి ఉంది. అన్నాచెల్లెలు అనుబంధానికి ప్రతీక చెప్పుకునే రక్షాబంధన్ సందర్భంగా స్వయంగా వెళ్లి రాఖీలు కట్టలేని యువతులు తమ లాజిస్టిక్స్​ను వినియోగించుకుని రాఖీలను, స్వీట్లను తమ అన్నలకు, తమ్ముళ్లకు పంపించుకోవచ్చని ప్రకటించింది.

24 గంటల్లోనే రాఖీలు, స్వీట్లు గమ్యస్థానాలకు బట్వాడా : ఆర్టీసీ సంస్థ నెట్​వర్క్​తో (RTC organization network) కేవలం 24 గంటల్లోనే రాఖీలను, స్వీట్లను గమ్యస్థానాలకు చేరవేస్తామని ఆర్టీసీ యాజమాన్యం హామీ ఇస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాకుండా, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు రాఖీలను, స్వీట్లను పంపించుకోవచ్చు అని అధికారులు పేర్కొంటున్నారు. బుకింగ్ కౌంటర్లు 24 గంటల పాటు ఎంపిక చేయబడిన బస్ స్టేషన్లలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా ఇప్పటికే హోల్​సేల్ అండ్ డిస్ట్రిబ్యూటర్లు (Wholesale and Distributors), హెల్త్ కేర్, ఫార్మా, లైఫ్ సైన్స్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, నిర్మాణ మెటిరీయల్స్, బిల్డింగ్ మెటీరియల్స్, ఈ-కామర్స్, స్థానిక చేతి వృత్తి ఉత్పత్తులు, సీజనల్ ఉత్పత్తులు, కూరగాయలు, పళ్లు, పూలు, పాలు, డైరీ ఉత్పత్తులు, మాంసం, పౌల్ట్రీ వంటి పార్శిళ్లను (Parcels like seasonal produce, vegetables, fruits, flowers, milk, dairy products, meat, poultry) బట్వాడా చేస్తుంది. ప్రతి రోజూ ఆర్టీసీ సగటున 14 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల పార్శిళ్లను టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు.

నిత్యం ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ, ప్రస్తుతం రాఖీలను, స్వీట్లను సకాలంలో చేర్చుతామని హామీ ఇస్తుంది. యువతులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది. మరిన్ని వివరాల కోసం https://www.tgrtclogistics.co.in వెబ్‌సైట్​లో సంప్రదించాలని అధికారులు సూచించారు.