TWJ: ప్రజా దీవెన, హైదరాబాద్ : ఐజేయూ అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) (TWJ) జర్నలిస్ట్ యాంటి అటాక్స్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దాస్ మాతంగి (Das Matangi)నియమితులయ్యారు.ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ప్రకటించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మాతంగి దాస్ మూడు దశాబ్దాలకు చేరువగా జర్నలిజం వృత్తిలో ప్రధాన స్రవంతి కల్గిన పత్రికల్లో సేవలందించి నిర్విఘ్నంగా కొనసాగు తున్నారు. జర్నలిజం తొలినాళ్ళ నుంచి జర్నలిస్టు సంఘంలో సమ్మిళితమవుతూ వేములపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా అరంగ్రేటం చేసి ఇంతింతై వటుడింతై అన్న చందంగా మిర్యాలగూడ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షులుగా, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, పదేళ్లు నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, సంఘం రాష్ట్ర కౌన్సిల్, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా, నల్గొండ జర్నలిస్ట్ యాంటి అటాక్స్ కమిటీ సభ్యులుగా వివిధ పర్యాయాలు విశిష్ఠ సేవలందించారు.
1995లోనే ఆంధ్రజ్యోతిలో వేములపల్లి కంట్రిబ్యూటర్ గా జర్నలిజం రంగంలోకి అరంగ్రేటం చేసి ఆ తదుపరి వార్త వేములపల్లి, మిర్యాలగూడ రూరల్, మిర్యాలగూడ పట్టణ, కోదాడ స్టాఫ్ రిపోర్టర్, నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, బ్రాంచ్ మేనేజర్, స్టేట్ బ్యూరో, నమస్తే తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్, తెలంగాణ చిన్న మధ్యతరహా డైలీస్, పిరియాడికల్స్ అసోసియేషన్ (Dailies and Periodicals Association)రాష్ట్ర అధ్యక్షులుగా వివిధ స్థాయిల్లో సేవలందించారు.
ఆ తదుపరి జర్నలిజంలో మూడు దశాబ్దాలుగా అన్న అనుభవాన్ని రంగరించుకొని అక్షిత తెలుగు జాతీయ దిన పత్రికను స్థాపించి చీఫ్ ఎడిటర్ గా… పత్రికను హైద్రాబాద్ కేంద్రంగా ప్రధాన పత్రికలకు ధీటుగా నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న తనను తెలంగాణ జర్నలిస్ట్ యాంటి అటాక్స్ రాష్ట్ర కమిటీ (Telangana Journalist Anti-Attacks State Committee) సభ్యులుగా నియమించడం పట్ల ఐజేయూ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, సంఘం జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, హెచ్ యూజే అధ్యక్షులుగా శిగా శంకర్, తెలంగాణ చిన్న మధ్యతరహా దిన, మాస పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్ ఇతర యూనియన్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
జర్నలిస్టులపై (journalists) దాడులు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో సంఘం తనకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యూనియన్ పెద్దల సహకారంతో జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకం పట్ల వివిధ సంఘాల బాధ్యులు, సీనియర్ జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి జర్నలిస్టులకు మరిన్ని సేవలందించాలని పలువురు ఆకాంక్షించారు.