May Day Events : ప్రజాదీవెన, నల్గొండ టౌన్: మేడే అమరవీరుల స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా కార్మికులు పని ప్రదేశాలలో అడ్డాలలో మేడే జెండా ఆవిష్కరణలు ర్యాలీలు సభలు ఘనంగా నిర్వహించాలని ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు.
సోమవారం ఎస్ఎల్బీసీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎగుమతి దిగుమతి అమాలి కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హామాలి కార్మికుల సంక్షేమం సామాజిక భద్రత వెల్ఫేర్ బోర్డు సాధన కోసం ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల మంది వివిధ విభాగాలలో హామాలి కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి సామాజిక భద్రత సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో హామాలి కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని దీనికోసం హమాలి కార్మికులందరు ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు యాజమాన్యాలకు అనుగుణంగా కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడులను తీసుకొచ్చిందని, ఈ లేబర్ కోడులు కార్మికులకు తీవ్రంగా నష్టం చేస్తాయని, ఈ కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు కోసం మే 20వ తేదీన దేశంలో ఉన్న 11 కేంద్ర కార్మిక సంఘాలు పిలుపుమేరకు జాతీయ సార్వత్రిక సమ్మెలో హామాలి కార్మికులందరూ పాల్గొనాలని కోరారు.
ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పని చేసే హామాలి కార్మికులకు రైతుల నుండి కాకుండా ప్రభుత్వమే హమాలీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం క్వింటన్ కు 60 రూపాయలు ఇవ్వాలని, జిల్లా వ్యాప్తంగా ఒకే రేటు అమలు చేయాలని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నిర్ణయించిన హమాలి రేట్ల పట్టిక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఇల్లు లేని హామాలి కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని అన్నారు. హామాలి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కార కోసం జిల్లా వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్, యూనియన్ అధ్యక్షులు రుద్రాక్షి శ్రీకాంత్, కార్యదర్శి కొత్త రాజు, మేస్త్రీలు దొండ నగేష్, కొత్త నాగయ్య ,కొత్త రవి, వజ్జ పరమేష్, రామచంద్రు, మాధవ్, వెంకన్న , తదితరులు పాల్గొన్నారు.